Begin typing your search above and press return to search.

ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసిన మహేష్..?

By:  Tupaki Desk   |   13 Dec 2021 2:15 PM IST
ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసిన మహేష్..?
X
టాలీవుడ్ హీరోలందరూ ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ స్థిరపడటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో విలాసవంతమైన సొంత ఇళ్లు కట్టుకోవడంతో పాటుగా భూములు - ప్లాట్స్ కొనుగోలు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లు హైదరాబాద్ నగర శివార్లలో ల్యాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలానే నగరంలోనే రెసిడెన్షియల్‌ ఏరియాలకు సంబంధించి అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌ లో పవన్ కళ్యాణ్ ఓ ఆస్తిని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఓ ప్లాటు కొన్నారని వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు నవంబర్ నెలలో 26 కోట్ల రూపాయల ఖరీదైన ప్లాట్‌ ను కొనుగోలు చేసినట్లు ప్రముఖ బిజినెస్‌ వెబ్‌ సైట్‌ కథనం ప్రచురించింది. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల వివరాల ప్రకారం వై. విక్రాంత్‌ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌ 1442 గజాల ప్లాటును తీసుకున్నారు.

ఇందుకు గాను రూ.26 కోట్లు చెల్లించిన మహేష్.. స్టాంప్‌ డ్యూటీ కింద రూ.1.43 కోట్లు - ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారని తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌ లో గజం భూమి ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకుగా ఉంటుంది. ఇప్పుడు మహేష్ కూడా అదే స్థాయిలో చెల్లించి ప్లాట్‌ కొనుగోలు చేశారని తెలుస్తోంది. 2021 నవంబరు 17న ఈ సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్ జరిగినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు.

దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ ఓ సినిమా చేయనున్నారు. ఇదే క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి తో మహేష్ ఓ భారీ పాన్ ఇండియన్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.