Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ రంగంలోకి సూపర్ స్టార్ మహేష్

By:  Tupaki Desk   |   4 Jun 2020 11:20 AM IST
వెబ్ సిరీస్ రంగంలోకి సూపర్ స్టార్ మహేష్
X
ఈ మధ్య టాలీవుడ్ లోకి కూడా వెబ్ సిరీస్ ల ట్రెండ్ పాకింది. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో హీరోయిన్ల వరకు వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ తాజా ప్రకారం ఓ స్టార్ హీరో తన సూపర్ హిట్ మూవీని వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు. అవును మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ మధ్య వరుస హిట్లతో దూసుకు పోతున్న మహేష్ కూడా వెబ్ సిరీస్ లో తన హిట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ రెండు సినిమాలు చేసాడు. ఒకటి శ్రీమంతుడు.. రెండోది భరత్ అనే నేను. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసాయి. అయితే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా శ్రీమంతుడు నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమాను మహేష్ బాబు వెబ్ సిరీస్ రూపంలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా తనకు ఎంత ఫేమ్ తీసుకొచ్చిందో.. జనాలకు కూడా అంతే నచ్చింది. ఎందుకంటే ఆ కథలో ఉన్న కంటెంట్ అలాంటిది. ఒక ధనవంతుడు ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని డెవలప్ చేయడమే ఈ కథలో సారాంశం. మరి ఈ కాన్సెప్ట్ మళ్లీ వెబ్ సిరీస్ లా తీస్తే జనాలు ఆదరిస్తారా లేదా అనేది ఓ సందేహం. పోనీ మంచి సామాజిక విలువలు కలిగిన సబ్జెక్టు కదా.. అనుకుంటే ఆల్రెడీ జనాలు థియేటర్లో.. టీవీలలో చూసి చూసి ఉన్నారు. కానీ మహేష్ బాబు వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడంటే కాస్త సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఆయన సినిమా.. ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడులే అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ శ్రీమంతుడు వెబ్ సిరీస్ లో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరో తెలియాల్సి ఉంది. అంతేగాక మహేష్ ఇందులో నటిస్తాడో లేదో కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలను వెబ్ సిరీస్ లోకి తీసుకొచ్చే ట్రెండ్ హాలీవుడ్ లో నడుస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో మహేష్ తెలుగులో ఓ కొత్త అధ్యయనానికి తెరలేపుతాడేమో చూడాలి!