Begin typing your search above and press return to search.

మహేషే ఒప్పుకోవాలిగా బాసూ..

By:  Tupaki Desk   |   7 Sept 2015 9:04 PM IST
మహేషే ఒప్పుకోవాలిగా బాసూ..
X
ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు మహేష్ బాబు.. తాను రీమేక్ సినిమాలకు పూర్తి వ్యతిరేకమని. ఆల్రెడీ ఎవరో చేసిన సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగదని.. అందుకే తాను రీమేకుల్లో నటించనని స్పష్టం చేశాడు మహేష్. మధ్యలో అప్పుడప్పుడూ రీమేక్ ఆఫర్లు వచ్చినా అతను అంగీకరించలేదు. ఐతే ఈసారి మహేష్ పై కొంచెం ప్రెజర్ ఎక్కువే ఉన్నట్లు సమాచారం. తమిళంలో ఆగస్టు 28న విడుదలై సంచలన విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను మహేష్ తో రీమేక్ చేయాలని డైరెక్టర్ రాజా చాలా పట్టుదలగా ఉన్నాడట. ఈ రీమేక్ పట్ల రామ్ చరణ్ ఇప్పటికే ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. రైట్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన రాజా ఆలోచన వేరేలా ఉంది.

తెలుగు రీమేక్ కు తనే దర్శకత్వం వహించాలని.. హీరో పాత్రను మహేష్ తో చేయించాలని చాలా పట్దుదలతో ఉన్నాడట రాజా. మహేష్ రీమేకుల్లో నటించడని తెలిసినప్పటికీ.. అతడితో సంప్రదింపులు జరిపాడట. మహేష్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశాడట. మహేష్ సినిమా చూసినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మహేష్ తన పాలసీల్ని పక్కనబెట్టి తొలిసారి రీమేక్ లో నటిస్తాడో లేదో చూడాలి. ఇక తని ఒరువన్ విశేషాలు చూస్తే.. ఇది గౌతమ్ మీనన్ సినిమాల తరహాలో ఓ పోలీసాఫీసర్ కి, హై ప్రొఫైల్ క్రిమినల్ కి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా. హీరోగా జయం రవి నటించగా.. విలన్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించడం విశేషం. నయనతార కథానాయిక. ఆద్యంతం గ్రిప్పింగ్ గా, థ్రిల్లింగ్ గా సాగడంతో తమిళంలో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకుంది తని ఒరువన్.