Begin typing your search above and press return to search.

అక్కడ స్పైడర్.. ఇక్కడ భరత్ అను నేను

By:  Tupaki Desk   |   17 May 2017 11:24 AM GMT
అక్కడ స్పైడర్.. ఇక్కడ భరత్ అను నేను
X
మామూలుగా ఒక సినిమా పూర్తి చేశాక.. కొత్త సినిమా మొదలు పెట్టడానికి సమయం తీసుకుంటుంటాడు మహేష్ బాబు. కానీ ‘స్పైడర్’ తర్వాత మాత్రం అలాంటి అవకాశం మహేష్ బాబుకు దొరకట్లేదు. ఈ సినిమా అనుకున్న ప్రకారమే పూర్తయి ఉంటే.. తన తర్వాతి సినిమాకు ముందు ఒక హాలిడే ఏదైనా ప్లాన్ చేసి ఉండేవాడేమో కానీ... ఇప్పుడు మాత్రం అందుకు ఛాన్సే లేదు. చెన్నైలో ప్రస్తుతం జరుగుతున్న ‘స్పైడర్’ క్లైమాక్స్ షూట్ పూర్తి కావడం ఆలస్యం.. వెంటనే హైదరాబాద్‌ లో దిగిపోనున్నాడు మహేష్. ఈ నెల 22నే మహేష్ కొత్త సినిమా ‘భరత్ అను నేను’ సెట్స్ మీదికి వెళ్లిపోతోంది. వారం పది రోజుల పాటు తొలి షెడ్యూల్ షూట్ చేయబోతున్నాడు కొరటాల.

తొలి షెడ్యూల్ పూర్తి చేశాక కొంచెం గ్యాప్ తీసుకోబోతున్నాడు మహేష్. జూన్ మధ్యలో ‘భరత్ అను నేను’ రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్-కొరటాల కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ‘భరత్ అను నేను’పైనా అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా టైటిల్ ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. మహేష్ ‘స్పైడర్’ నుంచి బయటికి రావడానికి ఆలస్యం కావడంతో ఈలోపు స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకున్నాడు కొరటాల. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్లు సిద్ధం చేయడం విశేషం. మహేష్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/