Begin typing your search above and press return to search.

'మురారి' 100 డేస్ ఫంక్షన్ అందుకే చేయలేదట!

By:  Tupaki Desk   |   21 May 2022 2:30 AM GMT
మురారి 100 డేస్ ఫంక్షన్ అందుకే చేయలేదట!
X
మహేశ్ బాబు కెరియర్ ఆరంభంలో ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో 'మురారి' ఒకటి. రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. 2001లో వచ్చిన ఈ సినిమా, ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. మహేశ్ బాబు సరసన నాయికగా సోనాలి బింద్రే అలరించింది. కైకాల .. లక్ష్మి కీలకమైన పాత్రలలో మెప్పించారు. అప్పట్లో తెరనిండుగా తారలతో సందడి చేసిన సినిమాలలో ఇది ఒకటి.

కెరియర్ పరంగా చూసుకుంటే మహేశ్ బాబుకి ఇది నాల్గొవ సినిమా. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలకంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. అప్పట్లోనే ఈ సినిమా నిర్మాణానికి గాను 8 కోట్లు ఖర్చు చేశారు. ఆ రోజుల్లో సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం ఒక రెండు వారాలైనా థియేటర్స్ లో నిలకడగా ఉండాలి. కానీ తొలి వారంలో 'మురారి' వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దాంతో ఈ సినిమా పోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ మౌత్ పబ్లిసిటీతో మూడోవారం నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి.

ఈ సినిమా నిర్మాత రామలింగేశ్వరరావు అంతకుముందు కృష్ణ హీరోగా కొన్ని సినిమాలను నిర్మించారు. అందువలన కృష్ణ ఫ్యామిలీతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. తన బ్యానర్లో మహేశ్ బాబుతో కూడా ఒక సినిమా ఉండాలనీ .. ఆయనకి ఒక హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రామలింగేశ్వరరావు ఈ సినిమా చేశాడని చెబుతారు. అందువల్లనే ఆయన అంతమంది ఆర్టిస్టులను .. అంతటి ఖర్చును భరించడానికి సిద్ధమయ్యాడని అంటారు. 3 వ వారం నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకోవడంతో ఈ సినిమా 100 రోజుల వరకూ నిలబడింది.

అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయభేదాలు వస్తూనే ఉన్నాయట. ప్రతీ విషయంలోను ఒకరు అవునంటే .. మరొకరు కాదనడం జరుగుతూ వెళ్లింది. హీరోయిన్ గా వసుంధర దాస్ (హే రామ్) తీసుకుందామని కృష్ణవంశీ అంటే, సోనాలి వైపు నిర్మాత మొగ్గు చూపారట. అలాగే కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అంటే, రామ్ ప్రసాద్ ను రంగంలోకి దింపాడట నిర్మాత. ఇలా మనస్పర్థలు పెరుగుతూ పోవడం వల్లనే, ఈ సినిమా 100 రోజుల పండుగను జరపలేదని అంటారు. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోకపోవడం విశేషం.