Begin typing your search above and press return to search.

శ్రీ‌మంతుడి స్పోర్ట్స్ సేవ‌!!

By:  Tupaki Desk   |   19 May 2018 9:54 AM GMT
శ్రీ‌మంతుడి స్పోర్ట్స్ సేవ‌!!
X
తెర మీదే కాదు... తెర వెన‌క కూడా సేవా కార్య‌క్ర‌మాల‌తో ‘శ్రీ‌మంతుడి’గా పేరు తెచ్చుకున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ‘శ్రీ‌మంతుడు’ సినిమా త‌ర్వాత ఆయ‌న ఆలోచ‌నా విధాన‌మే మారిపోయింది. అందులో పాత్ర‌కు త‌గ్గిన‌ట్టే బ‌య‌ట కూడా గ్రామాల‌ను ద‌త్త‌తు తీసుకోన్నాడు. పేద పిల్ల‌ల కోసం ఆసుప‌త్రుల‌ను క‌ట్టించి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు మ‌హేష్‌. ఇప్పుడు పేద క్రీడాకారుల కోసం త‌న వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.

మ‌న‌దేశంలో చాలామంది టాలెంటెడ్ క్రీడాకారులున్నాయి. అయితే వారిని ప్రొత్సాహించి... అవ‌స‌ర‌మైన క్రీడా సామాగ్రి- కోచింగ్ - గైడెన్స్ ఇప్పించే వాళ్లే క‌రువ‌య్యారు. ఆ బాధ్య‌త‌ను తీసుకుంది ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌. ఎన్.ఆర్‌.ఐ సేవా ఫౌండేష‌న్ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ పేద క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హాకారాలు అందిస్తూ... వాళ్లు క్రీడ‌ల్లో రాణించ‌డానికి తోడ్ప‌డుతోంది. కొన్ని నెల‌లుగా ఈ ఎన్.జీ.వోకి ఆర్థిక సాయం చేస్తున్నార‌ట న‌మ్ర‌తా- మ‌హేష్‌. ఈ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు హ‌రీష్ మాట్లాడుతూ... ‘మ‌హేష్- న‌మ్ర‌తా దంప‌తులు మా సంస్థ‌కి కొన్ని నెల‌లుగా ఆర్థిక స‌హాయం చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ఆ విష‌యం బ‌య‌టికి చెప్ప‌డానికి మాత్రం అంగీక‌రించ‌లేదు. చెబితే ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే ఇదంతా చేస్తున్నార‌నే అనుకుంటార‌ని సైలెంటుగా ఉన్నాం’ అన్నాడు.

ఈ సంస్థ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో ‘ఉచితా క్రీడ‌ల శిక్ష‌ణా శిబిరం’ ఏర్పాటు చేశారు. ఈ పోస్ట‌ర్ ని స్వ‌యంగా మ‌హేష్ ఆవిష్క‌రించ‌డం విశేషం. ఈ శిబిరంలో భావి త‌రాల ఆట‌గాళ్ల‌కి అవ‌స‌ర‌మైన క్రీడా శిక్ష‌ణతో పాటు ఫిట్ నెస్ ఎలా సాధించాలో కూడా ఉచిత‌ క్లాసులు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకున్న ‘శ్రీ‌మంతుడు’ ఇప్పుడు క్రీడాకారుల‌నూ ద‌త్త‌త తీసుకోనున్నాడ‌న్న మాట‌.