Begin typing your search above and press return to search.

ధోని రిటైర్మెంట్ పై మహేష్ , రాజమౌళి భావోద్వేగం

By:  Tupaki Desk   |   16 Aug 2020 6:30 AM GMT
ధోని రిటైర్మెంట్ పై మహేష్ , రాజమౌళి భావోద్వేగం
X
కాలం ఒడిలో అందరూ కరిగిపోవాల్సిందే.. ఎప్పటికైనా రిటైర్ మెంట్లు తప్పవు. కానీ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చి ఎంతో గొప్ప ఖ్యాతినిచ్చిన ఆటగాడు వైదొలగడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మహాభి నిష్క్రమణపై అందరూ భావోద్వేగం తో స్పందిస్తున్నారు. భారత క్రికెట్ కు చిరస్మరణీయ విజయాలను అందించిన ధోని సేవలను కొనియాడుతున్నారు.

శనివారం రాత్రి అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై చెప్పగానే క్రికెట్ ప్రేమికుల గుండె బద్దలైంది. ధోని లేని ఆటను చూడలేమంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా ధోని రిటైర్ మెంట్ పై స్పందిస్తున్నారు.

తాజాగా ధోని రిటైర్ మెంట్ పై ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు. ఫుల్ ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. 2011 ప్రపంచకప్ లో ధోని సిక్సర్ కొట్టి భారత్ కు వరల్డ్ కప్ అందించిన జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ ఫొటోను ట్విట్టర్ లో మహేష్ షేర్ చేశారు. ‘ఆ ఐకానిక్ సిక్సర్ ను నేనెలా మర్చిపో గలను. 2011 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఆ సమయంలో వాంఖడే స్టేడియంలో నిలబడ్డ నేను సంతోష గర్వంతో కన్నీళ్లు ఆపుకో లేకపోయాను. కానీ క్రికెట్ ఇక ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ భావోద్వేగం తో మహేష్ బాబు రాసుకొచ్చాడు.

ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా ధోని పై ఎమోషనల్ కు గురయ్యారు. ‘మమ్మల్ని ఎంటర్ టైన్ చేశారు. గర్వపడేలా చేశారు. స్ఫూర్తినిచ్చారు. రిటైర్ మెంట్ కష్టంగానే ఉంది. కానీ భవిష్యత్ తరాలకు మీరు ఒక మార్గ దర్శకం’ అని ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి.

ఇప్పటికే ఓసారి ధోని తన బయోపిక్ సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ రాగా.. ఈ ఫంక్షన్ ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ధోని గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచకప్ భారత్ సాధించి అప్పటికీ చాలా ఏళ్లు అయ్యింది. 1985లో కపిల్ దేవ్ సాధించారు. ఆ తర్వాత ధోని 2011లో సాధించారు. ప్రపంచకప్ గెలిచాక ధోని ఆ కప్పును అందుకొని సహచరులకు ఇచ్చి పక్కకు నిల్చున్నారు. లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం భావోద్వేగాలు ఆపుకో లేకపోయాడు. కానీ ధోని నుంచి ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ రాలేదు.. అంతటి గొప్ప కర్మయోగి’’ అంటూ రాజమౌళి ధోని గురించి ధోని స్వభావం గురించి అప్పట్లో గొప్పగా వర్ణించాడు.