Begin typing your search above and press return to search.

మహేష్ బాబు మరో కొత్త వ్యాపారం..?

By:  Tupaki Desk   |   26 Nov 2021 12:40 PM IST
మహేష్ బాబు మరో కొత్త వ్యాపారం..?
X
సినిమా హీరోహీరోయిన్లు చాలామంది కేవలం నటనకే పరిమితం కాకుండా సపోర్ట్ గా మరికొన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎవరైనా సరే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆలోచించడంలో తప్పేమీ లేదు. టాలీవుడ్ లో సైడ్ బిజినెస్ లు చేస్తున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.

హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ గా ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టారు మహేష్. ది హంబుల్ అనే డిజైనర్ వేర్ ద్వారా మహేష్ టెక్సటైల్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. అలానే ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట థియేటర్స్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. అంతేకాదు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మూవీ ప్రొడక్షన్స్ లోకి కూడా దిగారు.

మహేష్ నటించే ప్రతి సినిమాలోనూ భాగస్వామిగా వ్యవహరిస్తూ.. తన బ్యానర్ లో ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా సక్సెస్ అయిన మహేష్.. ఇప్పుడు మరో కొత్త వ్యాపారంపై దృష్టి పెడుతున్నారట. బైజూస్ తరహాలో ఒక ఈ-లెర్నింగ్ యాప్ ని తీసుకురావాలని మహేష్ బాబు ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆన్ లైన్ చదువులకు బాగా డిమాండ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ టైంలో ఎన్నో ఎడ్యుకేషనల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో బైజూస్ వంటి కొన్ని ఈ-లెర్నింగ్ యాప్స్ సక్సెస్ అయ్యాయి. బైజూస్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అలాంటి ఎడ్యుకేషనల్ యాప్ ని తీసుకురావాలని భావిస్తున్నారట.

అన్ని తరగతుల విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ తో అందరికి అందుబాటులో ఉండేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే విధంగా ఈ యాప్ ను డిజైన్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ ఎడ్యుకేషనల్ యాప్ కు సంబంధించిన ప్లాన్ రెడీ అవుతోందని టాక్. ఆల్రెడీ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్న మహేష్.. కొత్త వ్యాపారంలో అడుగుపెడుతున్నాడనే వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో మహేష్ వర్క్ చేయనున్నారు. ఇక నిర్మాతగా చేస్తున్న 'మేజర్' సినిమా 2022 ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది.