Begin typing your search above and press return to search.

'మహాసముద్రం' సాంగ్ ప్రోమో: రంభ కు స్పెషల్ ట్రిబ్యూట్ గా 'హే రంభా'..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 1:42 PM GMT
మహాసముద్రం సాంగ్ ప్రోమో: రంభ కు స్పెషల్ ట్రిబ్యూట్ గా హే రంభా..!
X
'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ''మహాసముద్రం''. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న మేకర్స్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

'మహాసముద్రం' చిత్రంలోని 'హే రంభా రంభా' అనే మాస్ సాంగ్ ని శుక్రవారం (ఆగస్ట్ 6) ఉదయం గం.10.08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సాంగ్ కు సంబంధించిన చిన్న క్లిప్పింగ్ వదిలారు. 'ఓ రంభా రంభా హే రంభా హే రంభా..' అంటూ సాగిన ఈ పాటలో హీరోయిన్ రంభ ఫ్లెక్సీలు కటౌట్లు దర్శనమిచ్చాయి. ఇది ఎవర్ గ్రీన్ హీరోయిన్ రంభకు స్పెషల్ మాసీ ట్రిబ్యూట్ అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. జాతర నేపథ్యంలో ఉన్న ఈ పాటలో శర్వా - సిద్దార్థ్ ఇద్దరూ బీర్ బాటిల్స్ పట్టుకుని రంభ కటౌట్ ముందు నిలబడి ఉన్నారు.

'హే రంభా రంభా' సాంగ్ కోసం ముందుగా మేకర్స్, రంభ పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ సాంగ్ ను వైజాగ్ లో వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేశారు. దీనికి చైతన్య భరద్వాజ్ మాసీ ట్యూన్ కంపోజ్ చేశారు. కాగా, 'మహాసముద్రం' చిత్రంలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాజ్ తోటా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. 'మహాసముద్రం' సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేయనున్న మేకర్స్.. రాబోయే రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచేసాయి.