Begin typing your search above and press return to search.

వాటి పుణ్యం.. దీని పంట పండింది

By:  Tupaki Desk   |   29 Aug 2017 8:30 AM GMT
వాటి పుణ్యం.. దీని పంట పండింది
X
ఓవైపు ‘కాటమరాయుడు’.. ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమాలు ఓవర్సీస్‌ లో బయ్యర్లను నిలువునా ముంచేస్తే.. మరోవైపు చిన్న సినిమాలు అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టేశాయి. గత నెలలో వచ్చిన ‘ఫిదా’ సినిమా అమెరికాలో ఎవ్వరూ ఊహించని విధంగా 2 మిలియన్ డాలర్లు దాటేసి ఆశ్చర్యపరిచింది. రెండు వారాల కిందట వచ్చిన చిన్న సినిమా ‘ఆనందో బ్రహ్మ’ హాఫ్ మిలియన్ మార్కు దాటడమూ ఆశ్చర్యమే. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ రూపంలో మరో చిన్న సినిమా అక్కడ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఆ సినిమా అక్కడ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఈ నేపథ్యంలో భారీ సినిమాలతో జూదం కన్నా.. చిన్న సినిమాల మీద పెట్టుబడి పెట్టడం మంచిదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు యుఎస్ బయ్యర్లు.

ఓవైపు మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ లాంటి స్టార్ల సినిమాల ఓవర్సీస్ బిజినెస్ ఓ పట్టాన తెగట్లేదు. నిర్మాతలు ఆశించిన రేటు ఇవ్వడానికి బయ్యర్లు తటపటాయించారు. కానీ చిన్న సినిమాలకు మాత్రం వాటి స్థాయికి మించి బిజినెస్ జరుగుతోంది. పైన చెప్పుకున్న మూడు సినిమాల ఊపు చూసి.. మారుతి-శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘మహానుభావుడు’కి అదిరిపోయే రేటు ఇచ్చింది ఓ సంస్థ. ఈ చిత్ర యుఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ఓ సంస్థ రూ.3.3 కోట్లకు కొనడం విశేషం. ఆ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద రేటే. అంటే ఈ చిత్రం మిలియన్ డాలర్లు కొడితేనే సేఫ్ జోన్లోకి వస్తుందన్నమాట. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. మారుతి ఇంతకుముందు ఇదే తరహాలో తీసిన ‘భలే భలే మగాడివోయ్’కి యుఎస్ తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. శర్వా గత కొన్నేళ్లలో నటించిన సినిమాలు చాలావరకు అక్కడ బాగా ఆడాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ రేటు ఇచ్చినట్లున్నారు.