Begin typing your search above and press return to search.

మ‌హాన‌టికి అవార్డుల ఆస్కార‌మెంత‌?

By:  Tupaki Desk   |   4 May 2019 7:23 AM GMT
మ‌హాన‌టికి అవార్డుల ఆస్కార‌మెంత‌?
X
ఒక సినిమా అవార్డు పొంద‌డానికి ఎలాంటి అర్హ‌త కావాలి? అంటే అందుకు ఎన్నో నియ‌మ‌నిబంధ‌న‌లు ఉంటాయి. ఎన్నో కోణాల్లో స్క్రుటినీ చేశాకే క‌మిటీ ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది. ఆ కోణంలో చూస్తే కీర్తి సురేష్ న‌టించిన `మ‌హాన‌టి` చిత్రానికి అవార్డులు కొల్ల‌గొట్టేందుకు ఏఏ అర్హ‌త‌లు ఉన్నాయి? అంటే .. ఈ సినిమాని ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేషించ‌వ‌చ్చు.

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ బృందం ఎంచుకున్న క‌థాంశ‌మే ఓ అవార్డ్ విన్నింగ్ ఫార్ములా అని చెప్పాలి. తెలుగు సినిమాని తొలి నాళ్ల‌(క్లాసిక్ డేస్‌)లో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వెట‌ర‌న్ క‌థానాయిక .. లెజెండ్ సావిత్రి జీవిత‌క‌థ‌ను ఎంచుకోవ‌డంతోనే రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో ఎంతో క్యూరియాసిటీ పాయింట్. ల్యాగ్ కి ఆస్కారం ఉన్న‌ ఒక జీవిత క‌థ అయినా.. ఆద్యంతం ఎలాంటి బోర్ లేకుండా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస‌య్యారు.

సావిత్రిగా కీర్తి సురేష్‌.. జెమినీ గ‌ణేష‌న్ గా దుల్కార్ స‌ల్మాన్ జీవించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ సినిమాకి న‌టీన‌టుల ఆహార్యం తో పాటు డైలాగ్స్ మ‌రో ప్ర‌ధాన ఆయుధంగా నిలిచాయి. ``నాకు సావిత్రి తెలియదు.. సావిత్రిగారు మాత్రమే తెలుసు..``. ``సావిత్రమ్మ కథకు మాటలు రాస్తుంది.. కాగితాలు కన్నీటితో తడిసిపోయాయి``. ``పెద్దవాళ్లని గౌరవించాలి, సావిత్రిగారి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలి``. ``జీవితంలో నటించొచ్చు కానీ, జీవితాన్ని నటించకూడదు``. ``ప్రతిభ ఇంటిపట్టునుంటే.. ప్రపంచానికి పుట్టగతులుండవు``. ``ఆడాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాళ్ల ఏడుపు మందు బాటిల్ కు మాత్రమే తెలుస్తుంది``. ``ఆవిడ కథలో కన్నీళ్ళునాయి.. కానీ వాటిని తుడుచుకుని లేచే ధైర్యం కూడా ఉంది``. ``ప్రేమించినవాడి కోసం అందర్నీ వాదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించినవాడ్ని కూడా వదులుకున్నాను``. ఈ డైలాగుల్లోనే ఎన్నో జీవితాల సారాంశాన్ని ఆవిష్క‌రించారు బుర్రా సాయిమాధ‌వ్. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయ‌ర్ సంగీతం మ‌రో ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది.

అందుకే `మ‌హాన‌టి` ప్ర‌స్తుతం జాతీయ అవార్డుల రేసు స‌హా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల బ‌రిలో ఉంది అన‌గానే ఈ సినిమాకి పుర‌స్కారాలు ద‌క్కుతాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇదివ‌ర‌కూ ఆస్ట్రేలియా తెలుగు సంఘాలు మ‌హాన‌టి టీమ్ ని ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డుల‌తో స‌త్క‌రించాయి. తాజాగా చైనాలో సాంఘై ఫిలింఫెస్టివల్ లో ఈ సినిమాని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎస్ ఐ ఎఫ్ ఎఫ్‌)కు మహానటి ఎంపికైంది. ఈ వేడుక‌ల‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఇంటర్నేషనల్ పనోరమ విభాగంలో ఈ ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా చైనా- మెయిన్ ల్యాండ్ లో `మహానటి` చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇదేగాక‌ ఎన్నో ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమా పండ‌గ‌ల్లో అవార్డుల‌కు ఈ చిత్రం పోటీప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో స‌మంత అక్కినేని- విజ‌య్ దేవ‌ర‌కొండ- క్రిష్ స‌హా ప‌లువురు టాప్ స్టార్లు న‌టించారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత‌ ఆదరణ లభించింది. నిర్మాత‌ల‌కు లాభాలు పండించిన సంగ‌తి తెలిసిందే.