Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఎన్ని సీక్వెల్స్ కావాలో

By:  Tupaki Desk   |   12 Jun 2018 7:35 AM GMT
ఇలా అయితే ఎన్ని సీక్వెల్స్ కావాలో
X
మహానటి విడుదలైన మూడు వారాలకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేసిన సీన్స్ యు ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే . అనూహ్యంగా వీటికి కూడా భారీ స్పందన దక్కింది. అవి చూసాక అందరికి కలిగిన అభిప్రాయం ఒకటే. ఒక పావు గంట అదనంగా కలిపినా పర్వాలేదు ఇవి కూడా సినిమాలో ఉంటే బాగుండేది అని. ముఖ్యంగా జెమిని గణేశన్ తన రెండో భార్య పిల్లలను నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపించే కొన్ని సీన్లు అందులో ఉన్నాయి.

సావిత్రి గారి అమ్మాయి విజయకు స్కూల్ లో నాన్న రెండో భార్య కూతురు రేఖ(ఇప్పటి బాలీవుడ్ హీరోయిన్)పరిచయం కావడం గురించి కీర్తి సురేష్ కు చెప్పే సీన్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది.ఇప్పటి దాకా ఈ ఒక్క సీన్ 29 లక్షల వ్యూస్ తెచ్చుకుంది అంటే ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత రేఖ తల్లిని పిల్లల్ని సావిత్రి గారు ఇంటికి పిలిపించి దగ్గరకు తీసుకున్నట్టుగా అందులో చూపించారు. నిజానికి ఇక్కడ సావిత్రి మంచితనం మరోసారి హై లైట్ అయితే మరోవైపు జెమిని గణేషన్ పుష్పవల్లి పిల్లల్ని నిర్లక్ష్యం చేశాడన్న మెసేజ్ బలంగా వెళ్ళింది. కానీ లెంగ్త్ విషయం డిలీట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ఇక్కడ మరో విషయం జాగ్రత్తగా గమనించాలి.

మహానటిలో కీలక పాత్రలు సావిత్రి, జెమినీ గణేషన్ సజీవంగా లేరు కనక ఇబ్బంది లేదు. సావిత్రి గారి పిల్లలు స్క్రిప్ట్ పరంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు కాబట్టి నాగ అశ్విన్ సమస్యగా భావించలేదు. కానీ రేఖ రిఫరెన్స్ తో పాత్రను చూపాలంటే మాత్రం ఆవిడ అనుమతి తీసుకోవాలి. రేఖ ముంబైలోనే ఉన్నారు. నాన్న జెమిని గణేశన్ వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు కానీ సినిమాల్లో కానీ చర్చించడానికి రేఖ ఏనాడూ ఇష్టపడలేదు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని అదే పనిగా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఈ నేపథ్యంలో రేఖ తన పాత్రను మహానటిలో నేరుగా చూపించేందుకు ఒప్పుకునే వారు కారేమో. అందుకే ఆ సీన్లు తీసినా నాగ అశ్విన్ ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని తీసేసి ఉండవచ్చు.

ఫైనల్ ఫుటేజ్ నాలుగు గంటల దాకా వచ్చిందని గతంలో చెప్పిన అశ్విన్ ఇప్పుడు రిలీజ్ చేసింది కొన్ని నిమిషాల సీన్లే. అలాంటిది ఇక వదలని వాటిలో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో అన్న ఆసక్తి రేగడం సహజం. అయినా ఇలా సావిత్రి గారి జీవితంలో జరిగినవన్నీ చూపిస్తూ పోతే ఇది ఒకటి రెండు సీక్వెల్స్ తో జరిగే పని కాదు. ఒకవేళ అలా తీయాలి అనుకుంటే వెబ్ సిరీస్ తప్ప మరో ఆప్షన్ లేదు. అప్పుడైతే మిస్ అయ్యాం అనుకున్న జగయ్య-గుమ్మడి-రాజబాబు-జమున-రమాప్రభ-భానుమతి-షావుకారు జానకి లాంటి వారు సావిత్రి గారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకునే అవకాశం కలిగి ఉండేది. ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు లెండి.