Begin typing your search above and press return to search.

'మహాన్' ట్రైలర్: కామర్స్ టీచర్ లిక్కర్ సిండికేట్ కింగ్ గా మారితే..!

By:  Tupaki Desk   |   3 Feb 2022 7:49 AM GMT
మహాన్ ట్రైలర్: కామర్స్ టీచర్ లిక్కర్ సిండికేట్ కింగ్ గా మారితే..!
X
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేని ‘అపరిచితుడు’, తమిళ అగ్ర కథానాయకుడు చియాన్ విక్రమ్. విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు తనయుడు ధృవ్ విక్రమ్ తో కలిసి ''మహాన్'' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్నారు. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజు దీనికి దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 10న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ''మహాన్'' చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. స్కూల్ లో స్టూడెంట్స్ అల్లరి భరించే కామర్స్ టీచర్ గాంధీ మహాన్ గా.. జీతంలో 50 రూపాయలు తగ్గిందని భార్యతో తిట్లు తింటున్న భర్తగా విక్రమ్ ని చూపించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

తన తండ్రి లక్ష్యమైన మధ్యపాన నిషేధం కోసం పోరాడతానని గాంధీ మహాన్ చిన్నతనంలోనే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాట తప్పి తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం సైద్ధాంతిక జీవన విధానాన్ని వదలి లిక్కర్ సామ్రాజ్యాన్ని శాసించే డాన్ గా మారినట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలో మహాన్ తన ఫ్యామిలీకి ఒక్కగానొక్క కొడుక్కి కూడా దూరమైనట్లు కనిపిస్తోంది.

'ఏపీ మందు సామ్రాజ్యానికి మహారాజు నా బాబు' అని ధృవ్ విక్రమ్ అనగా.. 'రేయ్ నా కొడకా.. ఇప్పుడు నీ బాబు.. అప్పుడు గాంధీ మహాన్ అని పేరు పెట్టుకున్న కామర్స్ టీచర్ కాదు' అని విక్రమ్ చెబుతున్నాడు. వేర్వేరు మార్గాల్లో వెళ్తున్న తండ్రీకొడుకులు ఒక్కటయ్యారా లేదా? మహాన్ తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా? సమాజంలో అతన్ని ప్రభావితం చేసిన అంశాలేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కార్తీక్‌ సుబ్బరాజు శైలి కాన్సెప్ట్ మరియు యాక్షన్ తో 'మహాన్' చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రియల్ లైఫ్ తండ్రీకొడుకులు విక్రమ్ - ధృవ్ విక్రమ్ పోటాపోటీగా నటించినట్లు తెలుస్తుంది. తొలి సారి వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సిమ్రాన్ - బాబీ సింహా - సనత్ - ముత్తుకుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ స్పెషల్ గా ఉన్నాయి. వివేక్ హర్షన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.