Begin typing your search above and press return to search.

కేసరిలో మగధీర మార్క్

By:  Tupaki Desk   |   22 March 2019 12:19 PM IST
కేసరిలో మగధీర మార్క్
X
నిన్న విడుదలైన అక్షయ్ కుమార్ కేసరి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్ల లెక్కలు ఇంకా బయటికి రాలేదు కాని సాధారణంగా డ్రైగా చెప్పుకునే గురువారం కూడా భారీ వసూళ్లు దక్కాయని రిపోర్ట్. ఎప్పుడో వందేళ్ళ వెనుక జరిగిన 21 సిక్కుల పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని రూపొందించిన ఈ మూవీ రియలిస్టిక్ అప్రోచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి మగధీరకు ఏంటి లింక్ అనే కదా మీ డౌట్. అక్కడికే వద్దాం.

కేసరి క్లైమాక్స్ లో శత్రువులైన పటాన్లు కోటను ఆక్రమించుకునేందుకు లోపలికి వేల సంఖ్యలో చొచ్చుకు వస్తారు. చివరి యోధుడిగా అక్షయ్ కుమార్ వాళ్ళతో తలపడతాడు. గుంపులుగా మీద పడుతున్నా చేతిలో కత్తితో ఒక్కొక్కరిని ఊచకోత కోస్తూ ఆఖరిగా తనను కవ్వించిన మౌలా మెడలో కత్తి దింపి ప్రాణాలు వదులుతాడు.ఈ ఎపిసోడ్ మొత్తం మగధీరలో వంద మందిని కాలభైరవ చంపే తరహాలోనే ఉంటుంది. సీక్వెన్స్ కాని యాంగిల్స్ కాని అదే ఫీలింగ్ కలిగిస్తాయి.

అంతే కాదు శ్రీహరి పాత్రను పోలిన శత్రువు వచ్చి అక్షయ్ కుమార్ తో పేరు కనుక్కుని నిన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా దాన్నే తలపిస్తుంది. కథ ప్రకారం రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేకపోయినా ఈ ఒక్క ఎపిసోడ్ లో మాత్రం మగధీర ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.

దీని తర్వాత గూస్ బంప్స్ ఇచ్చే సీన్ మరొకటి వస్తుంది. కథల ఎంపికలో ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తున్న అక్షయ్ కుమార్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి ప్రభావం బాలీవుడ్ మీద గట్టిగానే ఉందని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలి