Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' న్యూ పోస్టర్: అంధుడైన నితిన్ ఓ హత్యకు సాక్షిగా మారుతాడా..?

By:  Tupaki Desk   |   30 March 2021 6:36 AM GMT
మాస్ట్రో న్యూ పోస్టర్: అంధుడైన నితిన్ ఓ హత్యకు సాక్షిగా మారుతాడా..?
X
నేడు యూత్ స్టార్ నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'నితిన్30' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ''మాస్ట్రో'' అనే టైటిల్ ని ఖరారు చేసిన మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తిని కలిగించారు. స్టైలిష్ గా కనిపిస్తోన్న నితిన్.. నల్లద్దాలు ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని ఉండటం.. బ్యాక్ గ్రౌండ్ లో పియానోపై రక్తపు మరకలు కనిపించడంతో అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటా అని అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 'మాస్ట్రో' సినిమా బాలీవుడ్‌ లో ఘన విజయం సాధించిన 'అంధాదున్‌' రీమేక్‌ అని తెలిసిన వాళ్ళకి నితిన్ పాత్రపై ఓ ఐడియా వచ్చింది కానీ.. ఇతరులకు అనేక అనుమానాలు కలిగించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నితిన్ బర్త్ డే స్పెషల్ గా మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ మరో అప్డేట్ ఇచ్చారు.

''మాస్ట్రో'' చిత్రం నుంచి ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నితిన్ ధరించిన కళ్ళద్దాలలో రక్తపు మడుగులో పడివున్న ఓ శవం నీడ కనిపిస్తోంది. దీనిని బట్టి అంధుడైన నితిన్ ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఎలా మారతాడో అనే డౌట్ కలిగిస్తోంది. మరి సాయంత్రం రాబోయే సర్ప్రైజ్ వీడియోలో ఎలాంటి అంశాలను చూపిస్తారో చూడాలి. కాగా, 'మాస్ట్రో' చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్‌ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రను పోషిస్తుంది.

సీనియర్ నరేష్-జిషు సేన్ గుప్తా-శ్రీముఖి-అనన్య హర్షవర్ధన్- రచ్చ రవి-మంగ్లీ-శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి సాగర్‌ సంగీత సారథ్యం వహిస్తుండగా యువరాజ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు మాస్ట్రో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.