Begin typing your search above and press return to search.

మామా అల్లుళ్లకు కాలా పంచ్

By:  Tupaki Desk   |   25 Jan 2018 12:50 PM IST
మామా అల్లుళ్లకు కాలా పంచ్
X
ఈ మధ్య కాపీ రైట్ వివాదాలు దర్శకులకు, నిర్మాతలకు ఎంత పెద్ద చిక్కులు తెచ్చి పెడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఆయా సినిమాల్లో నటించిన హీరోలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అజ్ఞాతవాసి విషయంలో జరిగిన ఫ్రెంచ్ సినిమా రచ్చ ఇంకా పూర్తి చల్లారనే లేదు. కాకపోతే ఇవి మనకు మాత్రమే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న కోలీవుడ్ లో కూడా తరచు ఇలాంటి కాంట్రోవర్సీలు రేగుతునే ఉన్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజనికాంత్ కొత్త సినిమా కాలాకు అలాంటి చిక్కే వచ్చి పడింది. కబాలి ఫేం రంజిత్ పా దర్శకత్వం వహిస్తున్న కాలా షూటింగ్ చివరి స్టేజిలో ఉన్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీంకు కోర్టు నుంచి నోటీసులు రావడం సంచలనంగా మారింది.

రాజశేఖరన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కాలా కథ తనదే అంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. పదేళ్ళ క్రితమే కరికాలన్ అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో తాను రిజిస్టర్ చేయించానని, ఇప్పుడు తనకు చెప్పా పెట్టకుండా కథను వాడుకుని సినిమా కూడా తీసేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసారు. కరికాలన్ కథ కూడా రజనికాంత్ ను దృష్టిలో పెట్టుకునే రాసానని అతను చెప్పడం విశేషం. దీనికి బదులు చెప్పాల్సిందిగా కాలా నిర్మాత రజని అల్లుడు ధనుష్ కు, హీరో రజనికాంత్, దర్శకుడు రంజిత్ పాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోగా దీనికి స్పందించకపోతే తదుపరి చర్యలు ఉంటాయని అందులో పేర్కొంది.

రాజకీయ ప్రవేశం గురించి తన కార్య చరణ వేగవంతం చేస్తున్న టైంలో తన సినిమాలకు సంబంధించిన ఇలాంటి వివాదాలు రజనికి ఇబ్బందులు కలిగించేవే. ఇలాంటివే ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలుగా వాడుకుంటారు. రంజిత్ పా వీటిని కొట్టి పారేస్తున్నాడు కాని కోలీవుడ్ మీడియా మాత్రం ఇది నిజమనే వార్తలను ప్రచారంలోకి తేవడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇలాంటివి సాధారణంగా కోర్ట్ బయట సెటిల్ అవుతుంటాయి కాబట్టి కాలా కూడా అదే విధంగా పరిష్కారం అవుతుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఇంకా దీనికి రజని కాని ధనుష్ కాని నేరుగా స్పందించలేదు.