Begin typing your search above and press return to search.

వార్నీ.. హీరోయిన్ని మరీ అలా పొగడాలా

By:  Tupaki Desk   |   16 Sep 2015 1:30 PM GMT
వార్నీ.. హీరోయిన్ని మరీ అలా పొగడాలా
X
బాలీవుడ్ డైరెక్టర్ లలో మధుర్ బండార్కర్ ది ప్రత్యేకమైన శైలి. రియలిస్టిక్ కథాంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీస్తుంటాడీ డైరెక్టర్. అతను తీసిన ‘ఫ్యాషన్’ సినిమాతోనే ప్రియాంక చోప్రా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కొల్లగొట్టింది. అప్పటిదాకా నటిగా ప్రియాంకకు అంత గొప్ప పేరేమీ లేదు. కానీ మధుర్ చేతిలో పడగానే గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతో తన టాలెంట్ అందరికీ తెలిసి.. ఆపై ఇంకా మంచి పాత్రలు దక్కాయి. ఐతే తనకిలాంటి కెరీర్ అందించిన మధుర్ కు ప్రియాంక రుణపడి ఉండాలి. ఐతే చిత్రంగా మధురే ప్రియాంకకు రుణపడి ఉంటానంటున్నాడు. ప్రియాంకను చూసి దేశమే గర్వించాలంటూ ఆమె మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు మధుర్.

ఫ్యాషన్ రంగంలో తెరవెనుక చీకటి కోణాల్ని తన సినిమాల ద్వారా బయటపెట్టడానికి ఇష్టపడే మధుర్.. తాజాగా ‘క్యాలెండర్ గర్ల్స్’ అనే సినిమా తీశాడు. ఇది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీని తర్వాత ప్రియాంక చోప్రాతో ‘మేడమ్ జీ’ అనే సినిమా తీయాలనుకుంటున్నాడు. ఐతే ఆ సినిమా కోసం ఇంకా ప్రియాంక డేట్లు ఇవ్వకపోవడంపై మధుర్ మాట్లాడుతూ.. ‘‘ప్రియాంక అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో బిజీగా ఉందది. మేడమ్ జీ చేయడానికి ఒప్పుకుంది. ఐతే ఖాళీ లేకపోవడం వల్ల డేట్లివ్వలేకపోతోంది. తన కోసం ఎన్నాళ్లయినా ఎదురు చూస్తా. ఎందుకంటే అంత కంటే మంచి నటిని నేను వెతుక్కోలేను. ఆమె ఒకే అంటే 60 రోజుల్లో సినిమా పూర్తి చేస్తా. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ప్రియాంకను చూసి భారతీయులందరూ గర్వించాలి’’ అంటూ తన హీరోయిన్ని ఆకాశానికెత్తేశాడు మధుర్.