Begin typing your search above and press return to search.

ఇళయరాజా కూడా సమర్పించుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   20 March 2017 4:17 AM GMT
ఇళయరాజా కూడా సమర్పించుకోవాల్సిందే
X
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తోంది. తన పాటల్ని కచేరీల్లో ఉపయోగించుకుంటున్నపుడు తనకు రాయల్టీ ఇవ్వాలన్న ఇళయరాజా డిమాండ్ న్యాయమైందే కావచ్చు. కానీ బాలు లాంటి లెజెండ్ తో ఆయన ఇలా వ్యవహరించాల్సింది కాదన్నది అందరూ ఏకీభవిస్తున్న విషయం. బాలుతో వ్యక్తిగతంగా మంచి స్నేహం కూడా ఉన్న ఇళయరాజా.. ఆయనతో నేరుగా మాట్లాడి ఈ విషయంపై తేల్చుకోవాల్సిందని.. అలా కాకుండా లీగల్ నోటీసులివ్వడం ఏంటని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వివాదంపై తమిళ లిరిసిస్ట్ కమ్ రైటర్ మదన్ కార్కీ (బాహుబలికి ఇతనే రచయిత) ఫేస్ బుక్ లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఇళయరాజా తన పాటలకు సంబంధించి రాయల్టీ కోరుకోవడం సమంజసమే అని పేర్కొంటూ.. ఆయన ఈ వ్యవహారాన్ని ఇలా డీల్ చేయాల్సింది కాదని కార్కీ అభిప్రాయపడ్డాడు. ఇక అందరూ అనుకుంటున్నట్లుగా ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలకు సంబంధించి రాయల్టీ మొత్తం ఆయనకే చెందాలన్న వాదన కరెక్ట్ కాదని కార్కీ అభిప్రాయపడ్డాడు. నిబంధనల ప్రకారం రాయల్టీ ఆయన కంపోజ్ చేసిన పాట పాడిన గాయకుడు.. పాట రాసిన రచయిత.. ఆ పాట ఉన్న సినిమాను నిర్మించిన నిర్మాత.. వీళ్లందరికీ చెందాలని అన్నాడు మదన్. ఒకవేళ ఇళయరాజాకు రాయల్టీ వచ్చినా.. అందులో తమకూ వాటా ఇవ్వాలని మిగతా వాళ్లు అడగొచ్చని.. ఇళయరాజా తన పాటల్ని కచేరీల్లో వాడుకుంటే ఆయనకు కూడా మిగతా వాళ్లు లీగల్ నోటీసులు ఇవ్వొచ్చని ఆయన పేర్కొనడం విశేషం. మరి నిబంధనలు ఇలా ఉన్నపుడు రేప్పొద్దున ఇళయరాజాకు కూడా ఇబ్బందే కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/