Begin typing your search above and press return to search.

'మారో మారో'.. 'థ్యాంక్యూ' చిత్రం నుంచి యూత్‌ ఫుల్ మాస్ కాలేజ్ సాంగ్..!

By:  Tupaki Desk   |   10 Jun 2022 2:22 PM GMT
మారో మారో.. థ్యాంక్యూ చిత్రం నుంచి యూత్‌ ఫుల్ మాస్ కాలేజ్ సాంగ్..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''థ్యాంక్యూ''. 'మనం' వంటి క్లాసిక్ తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

''థాంక్యూ'' నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ మరియు ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. అలానే ఇటీవల వచ్చిన టీజర్‌ సినిమాపై అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ క్రమంలో తాజాగా 'మారో మారో' అనే యూత్‌ ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

'మారో మారో యుద్ధం మొదలు.. తాడో పేడో తేల్చయ్ ఇప్పుడు.. మారో మారో సిద్ధం ఎప్పుడు.. తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చేలేపు' అంటూ సాగిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది యూత్‌ ఫుల్ మాస్ కాలేజ్‌ సాంగ్. ఇందులో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించాడు. అదే సమయంలో బాక్సింగ్ ప్రాక్టీసు చేస్తూ యాక్షన్ కు సై అంటున్నాడు.

ఇందులో రెండు గ్యాంగుల మధ్య ఫైట్ ను.. రెండు హాకీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ని హైలైట్ చేస్తూ చూపించారు. చైతూ ని ఢీకొట్టే ప్రత్యర్థిగా సుశాంత్ రెడ్డి కనిపించారు. చై రఫ్ గా కనిపించేలా గడ్డంతో మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. సక్సెస్‌ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఎనర్జిటిక్​ యూత్​ ఫుల్​ సాంగ్ కు స్వరాలు సమకూర్చారు.

విశ్వ మరియు కిట్టు విస్సాప్రగడ 'మారో మారో' సాంగ్ కు క్యాచీ లిరిక్స్ అందించగా.. దీపు మరియు ప్రదీప్ చంద్ర కలిసి పాడారు. మహా ర్యాప్ ను ఆలపించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

''థాంక్యూ'' చిత్రంలో నాగచైతన్య సరసన రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా మారిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు - శిరీష్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథను అందించారు.

''థ్యాంక్యూ'' చిత్రాన్ని 2022 జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.