Begin typing your search above and press return to search.

తెలుగు ఇండస్ట్రీ నుంచి టీ ఆర్ ఎస్ కు ప్రపోజల్

By:  Tupaki Desk   |   25 Dec 2018 10:52 AM GMT
తెలుగు ఇండస్ట్రీ నుంచి టీ ఆర్ ఎస్ కు ప్రపోజల్
X
టీ ఆర్ ఎస్ కు అఖండ మెజార్టీ రావడం గొప్ప విషయమని. దీనివల్ల మరిన్ని మంచి పనులు చేసే అవకాశం ఆ పార్టీకి దక్కుతుందని ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా వ్యాఖ్యానించారు. టీ ఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో చిత్ర పరిశ్రమలో మరిన్ని మార్పులు, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

టీ ఆర్ ఎస్ లో గెలిచిన జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావులు సినీ పరిశ్రమతో ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నారని శివాజీ రాజా అన్నారు. కేసీఆర్, కేటీఆర్- హరీష్ - తలసాని లాంటి వారు మాట ఇస్తే తప్పరని.. సిని పరిశ్రమకు తలసాని లాంటి వారు ఉండడం చాలా మేలు చేస్తోందని శివాజీరాజా వ్యాఖ్యానించారు. దీనివల్ల తాము ప్రభుత్వ పెద్దలను కలవడం చాలా ఈజీ అని పేర్కొన్నారు.

ఇటీవల తాను సిద్దిపేటలో షూటింగ్ లో పాల్గొన్నానని.. అక్కడి పల్లె , పట్నం వాతావరణం తనకు గొప్పగా అనిపించిందని శివాజీ రాజా అన్నారు. ఇక్కడి ప్రజలు మంచివారని.. షూటింగ్ లకు ఎలాంటి డిస్టబెన్స్ కల్పించలేదన్నారు. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చేరుకునే సిద్దిపేటలో మినీ స్టూడియో లాంటిది ఏమైనా కడితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుందని శివాజీ రాజా ఆకాంక్షించారు. హరీష్ రావుగారు సిద్ధిపేటలో అద్భుతాలు చేశారని... ఒక స్టూడియో కడితే బావుటుందని సూచించారు. టీవీ రంగం పెరిగిపోవడం వల్ల ఏ స్టూడియో దొరకడం లేదని.. హైదరాబాద్ శివారు పెరిగిపోయిన దృష్ట్యా సిద్దిపేటలో మినీ స్టూడియో కడితే సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పెడితే బాగుంటుందని సూచించారు.

ఈ రెండు ప్రతిపాదనలతో తాము కేటీఆర్ గారిని కలిసేందుకు వెళుతున్నామని.. సిటీకి దగ్గరలో ఉండే ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతామని శివాజీరాజా పేర్కొన్నారు. త్వరలోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి కొత్తగా ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించడానికి వెళతామని శివాజీరాజా అన్నారు.

సినీ పరిశ్రమలోని వారికి ఆసరాగా ఉండేందుకు త్వరలోనే గోల్డేజ్ హోమ్ కట్టాలనే ఆలోచన ఉందని.. ఇది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని శివాజీరాజా పేర్కొన్నారు. పరిశ్రమలో చాలా మంది ఆర్థికంగా లేని వారు ఉన్నారని.. సీఎం కేసీఆర్ గారు పది ఎకరాలు ఇస్తే కడుతామని పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేశ్ సహా స్టార్ హీరోల సాయంతో నిధులు సమీకరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేశామని.. భూమి దొరకగానే పనులు మొదలుపెడతామని శివాజీరాజా పేర్కొన్నారు.