Begin typing your search above and press return to search.

‘మా’ బరిలో ఉన్న అభ్యర్థులు వీరేనా..?

By:  Tupaki Desk   |   1 Oct 2021 8:30 AM GMT
‘మా’ బరిలో ఉన్న అభ్యర్థులు వీరేనా..?
X
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోన్న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ ఈనెల 10న జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా మా ఎలక్షన్ పై ఏర్పడ్డ ఉత్కంఠ 10న జరిగే ఎలక్షన్ తో వీడనుంది. ఇప్పటి వరకు ప్రధానంగా విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లు పోటీలో ఉండగా మరొకంత మంది అధ్యక్ష, ఇతర పదవులకు పోటీ చేయనున్నారు. మొదట్లో అధ్యక్ష పదవికి పలువురి పేర్లు వినిపించగా ప్రధానంగా నలుగiరు నామినేషన్లు వేశారు. ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్లకు అవకాశం ఇవ్వగా.. 30న వాటిని పరిశీలించారు. నేడు లేదా రేపు స్క్రూటీనీ చేసి ఫైనల్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు.

మా ఎన్నికలపై గత నెల రోజులుగా తీవ్ర చర్చ సాగుతోంది. గతంలో ఎన్నికైన పాలకవర్గం గడువు తేదీ ఆగస్టులోనే ముగిసింది. దీంతో సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. అయితే కరోనా.. ఇతర కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిసింది. మొత్తానికి అక్టోబర్ 10న సినీ ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. గత అధ్యక్షుడిగా నరేశ్ ఎన్నిక కాగా.. ఈసారి బరిలోకి దిగకుండా ఆయన విష్ణుకు సపోర్టు చేస్తున్నారు. గతంలో మోహన్ బాబుతో కలిసి విష్ణు.. కృష్ణను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

ఇక మొదటి నుంచి విష్ణు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని చెబుతున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీ కోసం శాశ్వత భవన నిర్మాణం చేపట్టడానికి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ‘మా’కు శాశ్వత భవనం లేదని, తనను గెలిపిస్తే అసోసియేషన్ కు భవన ఏర్పాటు చేస్తానని అన్నారు. అయితే కొందరు భవనం సమస్య కాదని, సినీ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎన్నికైన వారు ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారోనని ఎదురుచూస్తున్నారు.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం అధ్యక్ష బరిలోకి దిగుతున్నారు. ఆయన తరుపున మెగా ఫ్యామిలీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే ప్రకాశ్ రాజ్ నాన్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని విష్ణు ప్యానెల్ ఆరోపణలు చేస్తోంది. లోకల్ అభ్యర్థికే ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన వారు మాత్రం లోకల్, నాన్ లోకల్ కంటే సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రచారం చేస్తోంది. అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం ఇండస్ట్రీ మొత్తం తనకే సపోర్టు ఉంటుందని నమ్ముతున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అధ్యక్ష పోరులో సీవిఎల్ నరసింహారావు, ప్రకాశ్ రాజ్, విష్ణు, కె శ్రవణ్ కుమార్ లు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కు పృథ్వీరాజ్, బెనర్జీ, హేమ, మాదాల రవి పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు శ్రీకాంత్, బాబు మోహన్ బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేశ్ , జీవితా రాజశేఖర్, రఘుబాబు ఉన్నారు. సహాయ కార్యదర్శికి అనితా చౌదరి, ఉత్తేజ్, బచ్చల శ్రీనివాసులు, భూపతిరాజు గౌతం రాజు, పడాల కల్యాణి పోటీ చేస్తున్నారు. కోశాధికారిగా నాగినీడు, శివబాలాజీ పోటీలో ఉన్నారు.

సభ్యులుగా 40 మంది బరిలో ఉన్నారు. రేపటి సాయంత్రంలోగా ప్రధానంగా పోటీలో ఎవరెవరు ఉంటారని తేలిపోనుంది. ఆ తరువాత తుదిజాబితా ప్రకటించున్నారు. అయితే ఫైనల్ అభ్యర్థుల ప్రకటన తరువాత ప్రచారం ఊపందుకోనుంది. గతంలో కంటే ఈసారి మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇండస్ట్రీలో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన సమ్యలను పరిష్కరించేవారినే ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా ఆ దిశగా ప్రచారం చేయనున్నారు.