Begin typing your search above and press return to search.

MAA ఎన్నికల న‌గారా! తాంబూల‌మిచ్చాం త‌న్నుకు చావండి!!

By:  Tupaki Desk   |   2 Aug 2021 5:20 AM GMT
MAA ఎన్నికల న‌గారా! తాంబూల‌మిచ్చాం త‌న్నుకు చావండి!!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌లు చాలాకాలంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిన‌దే. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఆగిపోయాయి. అయితే ఇటీవ‌ల కృష్ణంరాజు అధ్య‌క్ష‌త‌న‌ వ‌ర్చువ‌ల్ ఈసీ మీటింగ్ లో చివ‌రికి ఎల‌క్ష‌న్ క‌న్ఫామ్ అయ్యింది. మా ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లోనే జ‌రపాల‌న్న చ‌ర్చ వేడెక్కించింది. మీటింగ్ అనంత‌రం ఫ‌లానా తేదీ అని ప్ర‌క‌టించ‌డం ఒక్క‌టే పెండింగ్. సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు ఖాయ‌మైన‌ట్టేన‌ని మా స‌భ్యుల్లో చ‌ర్చ సాగింది.

ఇటీవల జరిగిన ఈసీ వ‌ర్చువ‌ల్ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు సీనియ‌ర్ నరేష్ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించబోతున్నందున రాజీనామా చేయడానికి అంగీకరించారు. నిజానికి కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం ఉన్నందున ఎన్నిక‌ల్ని వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని డిమాండ్ చేసిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. కానీ సినీపెద్ద‌లైన చిరంజీవి మోహ‌న్ బాబు త‌దిత‌రులు స‌కాలంలో ఎల‌క్ష‌న్ జ‌ర‌గాల‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

దీంతో 2021 సెప్టెంబ‌ర్ - 2023 సెప్టెంబ‌ర్ ప‌ద‌వీ కాలానికి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈసారి నువ్వా నేనా అంటూ ఆరుగురు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతుంటే.. అందులో ప్రకాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ గురించే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ త‌న క‌మిటీని మీడియా ముందుకు తీసుకువ‌చ్చి ఇత‌రుల కంటే ఎక్కువ దూకుడు చూపించారు. వీకే న‌రేష్ మీడియా స‌మావేశం వేడెక్కించింది. ఆయ‌న ప్ర‌కాష్ రాజ్ కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూ త‌న వ‌ర్గం స‌పోర్ట్ ని మంచు విష్ణుకి ఇస్తార‌ని భావిస్తున్నారు. ఇక మంచు విష్ణు సైతం మీడియా చానెళ్ల‌కెక్కి ఎటాక్ పెంచారు.

జైలు కెళ్లాల్సిన వాళ్ల‌ను కాపాడామ‌ని వాళ్ల పేర్లు చెబుతాన‌ని వ్యాఖ్యానించ‌డం తో అది కాస్తా సంచ‌ల‌నంగా మారింది. అలాగే సినీఇండ‌స్ట్రీకి అస‌లు పెద్ద దిక్కు అన్న‌వాళ్లే లేర‌ని కూడా మంచు విష్ణు వ్యాఖ్యానించ‌డం హీట్ పెంచింది. అలాగే మా భ‌వంతికి ఎవ‌రూ ఏమీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా తానే నిర్మిస్తాన‌ని అన‌గా.. స్థ‌ల సేక‌ర‌ణ ఎలా చేస్తారో చెప్పాల‌ని ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం లో ఉన్న నాగ‌బాబు కౌంట‌ర్ వేశారు.

ఇప్పుడు ఎన్నిక‌లు ఖాయ‌మ‌య్యాయి కాబ‌ట్టి వీరంతా మళ్లీ తమ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. వారు ఒకరితో ఒకరు పోటీ పడడం మ‌రోసారి ర‌చ్చ‌కు తెర లేపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎవ‌రికి వారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం నుండి తప్పుకునే మూడ్ లో లేరు. ఏకగ్రీవ ఎంపికకు చోటు లేదని సినీపెద్ద‌లే క్లారిటీనిచ్చేస్తున్నారు. మునుముందు ఈ ప్రచారం .. అనేక వివాదాలకు తావిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి పోటీబ‌రిలో జీవిత‌..హేమ‌.. సీవీఎల్ వంటి వారు ఉన్నారు. వీరంతా ఎవ‌రికి వారు సొంత ఎజెండాల‌తో ముందుకొస్తున్నారు. అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక‌పోతే తాంబూలాలిచ్చేశాం త‌న్నుకు చావండి అన్న తీరుగా ఉందీ వ్య‌వ‌హారం.

ఈసారికి ఇలా చేస్తే బావుండేదేమో..!

MAA భ‌వంతికి ..ప్ర‌కాష్ రాజ్ ఎక‌రం సేక‌రిస్తే.. మంచు విష్ణు 30కోట్లు ఇస్తారు! అంటూ ఇటీవ‌ల ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. ఇది నిజంగా గుడ్ ఐడియా. శ‌త్రువుల్ని మిత్రుల్ని చేసే ఆలోచ‌న మంచిదేగా. ఎవ‌రొచ్చార‌న్న‌ది కాదు ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది ముఖ్యం. మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల్లో ప్ర‌చార‌మంతా మా సొంత భ‌వంతి నిర్మాణం చుట్టూనే తిరుగుతోంది కాబ‌ట్టి ఆ ఇద్ద‌రినీ క‌ల‌పాలి. ఎవరికి వారు న‌డిగ‌ర సంఘం త‌ర‌హాలో 30 కోట్లు పెట్టి భారీగా మా అసోసియేష‌న్ సొంత భ‌వంతిని నిర్మించాల‌ని క‌ల‌లు గంటున్నారు గ‌నుక ఆ ఇద్ద‌రికీ ఒక‌ అవ‌కాశం క‌ల్పించాలి. ఈసారి `మా` ఎన్నిక‌ల‌ను ఎలాంటి ర‌భ‌స‌కు ఆస్కారం ఇవ్వ‌కుండా ఏక‌గ్రీవం చేయాలి.

అలాగే మా అసోసియేష‌న్ కు ఎక‌రం స్థ‌లం సంపాదించే తెలివితేట‌లు త‌న‌కున్నాయ‌ని ప్ర‌భుత్వంతో అధికారుల‌తో మాట్లాడే ప‌ర‌ప‌తి త‌న వ‌ద్ద ఉంద‌న్న ప్ర‌కాష్ రాజ్ ని తెలివిగా స‌ద్వినియోగం చేయాలి. తెరాస అధినేత‌ల‌తో అసోసియేష‌న్ కి స్థ‌లం సంపాదించే ప‌నిని ఆయ‌న‌కు అప్ప‌గించాలి. అలాగే మా బిల్డింగ్ కి ఎవ‌రి వ‌ద్ద నుంచి అణా పైసా అయినా తీసుకోన‌ని త‌న సొంత డ‌బ్బుతోనే నిర్మిస్తాన‌న్న మంచు విష్ణు భ‌వంతికి అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం నిధిని స‌మ‌కూర్చ‌మ‌ని అడ‌గాలి.

ఆ ఇద్ద‌రినీ క‌లిపి రెండేళ్ల‌కు చెరో ఏడాది అధ్య‌క్షుడు అయ్యేలా ప్లాన్ ని రీడిజైన్ చేయాలి. ఆ ఇద్ద‌రినీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ మానిట‌ర్ చేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా మా సొంత భ‌వంతి నిర్మాణం పూర్త‌య్యేలా చేయాలి. త‌మిళ తంబీల‌ న‌డిగ‌ర సంఘం భ‌వంతిలా నిర్మించాలంటే 30 కోట్లు పెట్టాలి. అలాగే ఎక‌రం స్థ‌లం హైద‌రాబాద్ న‌డిబొడ్డున‌ కావాలంటే 30 కోట్లు పైమాటే.. అంటూ ఫిక్ష‌న్ స్టోరి ఆస‌క్తిని క‌లిగించింది. కానీ ఇదే నిజ‌మైతే అంద‌రికీ మేలే అన్న వారు లేక‌పోలేదు.