Begin typing your search above and press return to search.

డ‌బ్బింగ్ పాట‌లంటే చుల‌క‌నా?

By:  Tupaki Desk   |   14 Sept 2019 8:00 PM IST
డ‌బ్బింగ్ పాట‌లంటే చుల‌క‌నా?
X
డ‌బ్బింగ్ సినిమాల‌కు మాట‌లు- పాట‌లు రాయ‌డం అంటే వీజీనా? లిప్ సింక్ కుదిరేలా మాట‌-పాట కుదిరితే స‌రిపోతుందా? అంటే .. అది స్ట్రెయిట్ సినిమాకు చేసే సేవ‌కంటే క‌ష్టం అని అనువాద‌కులు చెబుతుంటారు. లిప్ సింకు కుదిరితే చాల‌దు.. భాష‌ భావం కుద‌రాలి. ఆ సన్నివేశానికి వంద శాతం అత‌కాలి. లేదంటే ఫ‌లితం కూడా అలానే బెడిసికొడుతుంద‌నేది అనుభ‌వ పూర్వ‌కంగా చెబుతుంటారు.

అయితే డ‌బ్బింగ్ చిత్రాల‌ ర‌చ‌యిత‌లను ప‌రిశ్ర‌మ‌లో చిన్న చూపు చూస్తార‌నే ఆవేద‌న ఆ కేట‌గిరీ రైట‌ర్ల‌లో రెగ్యుల‌ర్ గా క‌నిపించేదే. తాజాగా బందోబ‌స్త్ ప్రీరిలీజ్ వేడుక‌లో గేయ రచయిత వనమాలి ఈ చుల‌క‌న భావంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ ``డబ్బింగ్ పాటలు అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. `ఏం ఉంటుంది? మాతృకలో ఉన్న భావాలను రాస్తే స‌రిపోతుంది క‌దా అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. నిజంగా స్ట్రెయిట్ సినిమాల‌కు పాట‌లు రాయడం కంటే డబ్బింగ్ పాట‌లు రాయడం కష్టం`` అని అన్నారు.

హ్య‌పీ డేస్.. ఆరెంజ్ చిత్రాల‌కు పాట‌లు రాసిన నేను శివ‌పుత్రుడు- రంగం లాంటి డ‌బ్బింగ్ చిత్రాల‌కు రాశాన‌ని ఆయ‌న అన్నారు. డ‌బ్బింగుల‌కు రాసేప్పుడు మాతృక‌ భావాన్ని తెలుగులో స్ట్రెయిట్ పాట‌ల్లా రాయడానికి ఎంత కష్టపడ్డామనేది పాటలు వింటున్నప్పుడు అర్థ‌మ‌వుతుంది అని తెలిపారు. మణిరత్నం- శంకర్ తర్వాత కేవీ ఆనంద్ కి పాట‌లు రాయ‌డం అంటే భ‌యం. ఆ ముగ్గురూ పాట రాసేటప్పుడు పక్కన కూర్చుని ప్రతి పదానికి అర్థం ఏమిటో అడిగి తెలుసుకుంటారు. `రంగం` నుండి కేవీ ఆనంద్ ప్రతి సినిమాకు నాతో పాట రాయించుకుంటున్నారు. ఆయనతో పని చేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందని తెలిపారు.

అయితే వేటూరి వంటి మ‌హా ర‌చ‌యిత‌లు రాసిన డ‌బ్బింగ్ పాట‌లు ఇప్ప‌టికీ పాడుకునేలా ఎంతో అద్భుత‌మైన సాహిత్యంతో అల‌రించాయి. రోజా-బొంబాయి- స‌ఖి- చెలి-జీన్స్- ఇద్ద‌రు-యువ‌-ప్రేమిస్తే- సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ లాంటి క్లాసిక్ అనువాద చిత్రాల‌కు వేటూరి అందించిన సాహిత్యం ఇప్ప‌టికీ తెలుగు శ్రోత‌లు ఆరాధ‌న‌గా వింటారు. ప‌దే ప‌దే పాడుకుంటారు. ఆయ‌న విష‌యంలో మాత్రం ఈ ఆవేద‌న శ్రోత‌ల పాయింట్ ఆఫ్ వ్యూలో క‌నిపించ‌లేదు. వేటూరి అనంత‌రం ప్ర‌య‌త్నించిన వారిలో వ‌న‌మాలి-సాహితి-వెన్నెల‌కంటి వంటి వారు బాగానే రాణించారు. ఇక డ‌బ్బింగ్ సినిమాల‌కు మాట‌లు రాసేప్పుడు లిప్ సింక్ మిస్స‌వ్వ‌కుండా.. భావం చెడ‌కుండా రాయ‌డానికి ప‌లువురు ర‌చ‌యిత‌లు చాలానే కుస్తీలు ప‌డుతుంటారన్న‌ది తెలిసిన నిజం.