Begin typing your search above and press return to search.

ఆ లిరిసిస్టును ‘ఆ సాయం’ అడిగారట

By:  Tupaki Desk   |   10 Sept 2017 4:49 PM IST
ఆ లిరిసిస్టును ‘ఆ సాయం’ అడిగారట
X
తెలుగు సినిమాల్లో మహిళా లిరిసిస్టులు చాలా అరుదు. ఎవరైనా మహిళ గేయ రచయితలు పాటలు రాసినా అవి చాలా తక్కువగా ఉంటాయి. లిరిసిస్టుగా క్రమం తప్పకుండా పాటలు రాసి.. తనకంటూ ఒక పేరు సంపాదించిన మహిళలు దాదాపుగా లేరనే చెప్పాలి. ఐతే ఇప్పుడు శ్రేష్ఠ అనే అమ్మాయి లిరిసిస్టుగా తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’లో చివరగా వచ్చే మధురం మధురం పాటను రాయడమే కాదు.. ఆ పాటకు ట్యూన్ కూడా శ్రేష్ఠనే కట్టడం విశేషం. దీంతో పాటు ‘యుద్ధం శరణం’ సినిమాలోనూ నీ వల్లనే.. ఎన్నో ఎన్నో భావాలే.. లాంటి మంచి పాటలు రాసిందామె. దీనికంటే ముందు ‘పెళ్లిచూపులు’ సినిమాలో ‘చినుకు తాకే..’.. ‘మెరిసే మెరిసే..’ లాంటి పాటలకు కూడా సాహిత్యం సమకూర్చింది శ్రేష్ఠ.

ఐతే సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో తనకు చాలా ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయని అంటోంది శ్రేష్ఠ. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా కథలు వింటుంటాం. ఈ గేయ రచయితకు కూడా ఆ రకమైన ఇబ్బందులు తప్పలేదట. అవకాశాల కోసం వెళ్తే ఆమెను ‘ఆ సాయం’ అడిగారట. ఒక పేరున్న రచయిత దగ్గర అసిస్టెంటుగా చేరడానికి వెళ్తే.. ‘ఇక్కడ రాణించాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదు అమ్మడూ’ అని ఆ రచయిత అదోలా నవ్వాడట. కేవలం టాలెంటుతోనే నేనేంటో నిరూపిస్తా అంటూ సవాలు చేసి వచ్చిందట శ్రేష్ఠ. అతడితో పాటు మరికొందరు కూడా అవకాశాలు ఇస్తామంటూనే దానికి ప్రతిఫలం ఇవ్వాల్సి ఉంటుందని మాట్లాడారట. వాళ్లను ఎదిరించినందుకు తనకు అవకాశాలు రాకుండా చేశారని.. ఫోన్లో బెదిరించడం కూడా జరిగిందని ఆమె వెల్లడించింది. ఐతే ఈ ఇబ్బందులన్నింటినీ తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడ్డానని.. తనకు ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’తో తొలి అవకాశం వచ్చిందని.. ఆ సినిమాలో అన్ని పాటలూ తానే రాశానని.. ‘పెళ్లిచూపులు’ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పింది శ్రేష్ఠ.