Begin typing your search above and press return to search.

అమితాబ్ వార‌సుడు ఇన్నేళ్ల‌ కెరీర్ లో లేనిది..!

By:  Tupaki Desk   |   20 Oct 2020 4:15 AM GMT
అమితాబ్ వార‌సుడు ఇన్నేళ్ల‌ కెరీర్ లో లేనిది..!
X
బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ న‌టుడిగా ఏ స్థాయిలో నిలిచారో చెప్పాల్సిన ప‌నే లేదు. లెజెండరీగా ఎదిగిన ఆయ‌న న‌ట‌వార‌సుడి విష‌యంలో మాత్రం పెద‌వి విరుపులే క‌నిపిస్తాయి. అమితాబ్ స్థాయితో పోలిస్తే అభిషేక్ బ‌చ్చ‌న్ చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ‌లే ఉన్నాయి. బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా కానీ అసాధార‌ణ స్టార్ డ‌మ్ అత‌డికి ద‌క్క‌నే లేదు.

అయితే ఇటీవ‌ల అభిషేక్ బ‌చ్చ‌న్ ని త‌న కొలీగ్స్ పొగిడేస్తున్న తీరు చూస్తుంటే ఒక మెట్టు పైకి ఎక్కాడా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఈ ఏడాది ప్రారంభంలో బ్రీత్ అనే వెబ్ సిరీస్ తో స‌డెన్ గా అభిమానులను ఆశ్చర్యపరిచిన అభిషేక్ బచ్చన్ ఈసారి ఇంకో ట్విస్టిచ్చాడు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన లూడో ట్రైలర్ ఇటీవ‌ల విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అభిషేక్- ఆదిత్య రాయ్ కపూర్- రాజ్ కుమార్ రావ్ - సన్యా మల్హోత్రా- ఫాతిమా సనా షేక్ తదిత‌ర‌ తారాగణంతో ఆసక్తికరమైన బృందంతో ఈ చిత్రం డార్క్ కామెడీగా తెర‌కెక్కుతోంది. ఈ మూవీ ట్రైలర్ అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో తుఫాన్ వేగంతో దూసుకెళుతోంది.

ఈ ట్రైల‌ర్ చూశాక అభిషేక్ ను హృతిక్.. ప్రియాంక చోప్రా లాంటి స్టార్లు పొగిడేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లూడో ట్రైలర్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పలువురు ప్రముఖులు ప్రశంసించారు. లూడో ట్రైలర్ “చాలా బాగుంది!” అని అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. ధూమ్ 2 కొలీగ్ హృతిక్ రోషన్ ‘అద్భుతం’ అంటూ కితాబిచ్చేశాడు. అయితే శిల్పా శెట్టి ట్రైలర్ లో జూనియర్ బచ్చన్ న‌ట‌న‌ను పొగిడేశారు. సినిమా చూడటానికి ఇంకా వేచి ఉండలేనని పేర్కొంది. హౌస్ ఫుల్ 3 కొలీగ్ రితీష్ దేశ్ ముఖ్ కూడా ఈ ట్రైలర్‌ను ‘అత్యుత్తమమైనది’ అంటూ పొగిడేశాడు.

అంతకుముందు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా అభిషేక్ టీమ్ ను అభినందించారు. పరిశ్రమకు చెందిన తన సహచరులలో కొంతమందికి వర్చువల్ స్క్రీనింగ్ నిర్వహించాలని చిత్రనిర్మాత అనురాగ్ బసును అభ్యర్థించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “ఏమి ట్రైలర్ !! బసు.. టోపీలు! మొత్తం జట్టుకు అభినందనలు! ఈ మూవీ కోసం ఇంకా వేచి ఉండలేం.. నేను ఎంతసేపు వేచి ఉండాలి?`` అంటూ అమీర్ ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.