Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: చిన్న నిర్మాత‌ల‌కు దిక్కేది?

By:  Tupaki Desk   |   2 March 2019 7:00 AM IST
టాప్ స్టోరి: చిన్న నిర్మాత‌ల‌కు దిక్కేది?
X
టాలీవుడ్ ప్ర‌స్తుతం సంపులో ప‌డింది. సినిమాలు తీసేవాళ్లు ఉన్నా వాటిని స‌రైన విధానంలో ప్ర‌మోట్ చేసుకునేవాళ్లే లేరు. దీంతో నెగెటివిటీ ప‌రాకాష్ట‌లో ఉంద‌న్న విమ‌ర్శ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈ విష‌యంలో పీఆర్వో వ‌ర‌ల్డ్ తో పాటు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా సినిమాల ప‌బ్లిసిటీ విష‌యంలో ఏదో క్లారిటీ మిస్స‌య్యిందే అన్న ఫీలింగ్ అంద‌రిలోనూ ఉంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మంచి సినిమా ఏదో.. చెత్త సినిమా ఏదో తెలుసుకోలేని స‌న్నివేశం ప్రేక్ష‌కులను క‌న్ ఫ్యూజ‌న్ లోకి నెట్టేస్తోంది. దీంతో థియేట‌ర్ల‌కు వెళ్లే ముందు ఏ సినిమాని ఎంచుకోవాలి? అన్న డైలెమా కొన‌సాగుతోంది.

అయితే కొన్ని సినిమాల విష‌యంలో నిర్మాత స్వ‌యంకృత‌మే కార‌ణ‌మ‌న్న వాద‌న ఉంది. స‌రైన ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డంలో నిర్మాత‌ల త‌డ‌బాటు మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. రిలీజ్ త‌ర్వాత కూడా.. బావుంది అన్న సినిమాని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోతే అది బావున్నా ఎందుకూ ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంది. థియేట‌ర్ల‌కు ఎదురు చెల్లింపులు చేయాల్సి రావ‌డం అన్న‌ది నిర్మాత‌ల‌కు ఓ శాపంగా ఉంది. అదొక్క‌టే కాదు మూలిగే న‌క్క‌పై బోలెడ‌న్ని తాటిపండు చందంగా చాలానే ఉంటాయిక్క‌డ‌. నిర్మాత - జ‌ర్న‌లిస్టుల మ‌ధ్య ర‌క‌ర‌కాల అడ్డు గోడ‌లు కూడా ఒక ర‌కంగా ఇందుకు కార‌ణ‌మేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. దీనిపైనా ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

పేరున్న అగ్ర హీరో సినిమా - పెద్ద బ్యాన‌ర్ .. పెద్ద ద‌ర్శ‌కుడి సినిమా అయితే కొంత‌వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు. స్టార్ ఇమేజ్‌ వ‌ల్ల జ‌నాల‌కు తెలుస్తోంది. కానీ చిన్నా చిత‌కా హీరోలు న‌టించిన సినిమాలు అస‌లు ఎప్పుడొస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో మీడియాకే తెలియ‌ని స‌న్నివేశం నెల‌కొంది. కొంద‌రు నిర్మాతలు సినిమాలు తీసేసినా - ప్ర‌చార బ‌డ్జెట్ విష‌యంలో ప్లానింగ్ లేక‌పోవ‌డం ఈ సంపున‌కు కార‌ణ‌మ‌ని ఫిలింఛాంబ‌ర్ కి చెందిన ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి విశ్లేషించారు. ఈ శుక్ర‌వారం ఓ చిన్న సినిమా రిలీజైంది. అస‌లు రిలీజైందో లేదో కూడా ఎవ‌రికీ తెలీదు. ప్ర‌తి శుక్ర‌వారం .. వారం వారం ఇలాంటి చిన్న సినిమాలు రిలీజ్ ల‌కు వ‌స్తున్నాయి. కానీ వాటి గురించి ఎవ‌రికీ తెలియ‌డం లేదు. ఇక‌పోతే చిన్న సినిమాల విష‌యంలో నిర్మాతల మండ‌లి చొర‌వ కూడా జీరో అయ్యింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదివ‌రకూ చిన్న నిర్మాత‌ల సంఘం అంటూ ఓ హ‌డావుడి అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇండ‌స్ట్రీ మొత్తం డ‌ల్ అయిపోయింది. డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణానంత‌రం అస‌లు చిన్న సినిమా అన్న మాట ఎత్తిన‌వాడే క‌నిపించ‌లేదాయె. కొంత‌లో కొంత జీఎస్టీ త‌గ్గింపు వంటివి చిన్న సినిమా బ‌తక‌డానికి ఆస‌రా అయ్యింది. లేక‌పోతే ఈపాటికే అస‌లు ఆ ప‌దం మ‌ర్చిపోయేవారు. ఇదివ‌ర‌కూ 30 ఇయ‌ర్స్ పృథ్వీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప్ర‌తి యేటా డ‌జ‌నున్న‌ర సినిమాలు మినిమంగా చేసేవాడిని. కానీ ఈసారి ఆ సంఖ్య చాలా త‌గ్గిపోయింది. 2018-19 సీజ‌న్ లో జీఎస్టీతో పాటు ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ పెర‌గ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కూ సినిమాలు తీసేవాళ్లు త‌గ్గిపోయారు. దాని వ‌ల్ల నాకు సినిమాలు త‌గ్గిపోయాయి అని తెలిపారు. ఇటీవ‌లి కాలంలో జ‌బ‌ర్ధ‌స్త్ స్టార్లు సైతం స‌రిగా ఛాన్సుల్లేక ఖాళీ అయిపోయామ‌ని వాపోతున్న సంద‌ర్భం ఉంది. అస‌లు చిన్న సినిమా విష‌యంలో ఏం జ‌రుగుతోంది? జ‌నాల్లో క్యూరియాసిటీ పెంచ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫెయిల‌వుతున్నారా? నాశిర‌కంగా చుట్టేసి ఏదో రిలీజ్ చేసాంలే అనుకుంటున్నారా? అన్న‌ది నిర్మాత విజ్ఞ‌త‌కే తెలియాలి. దీని వ‌ల్ల స‌క్సెస్ రేటు త‌గ్గి సినిమాలు తీసేవాళ్లు నీర‌స‌ప‌డి ఆర్టిస్టుల‌కు ఛాన్సుల్లేకుండా పోతున్నాయి.