Begin typing your search above and press return to search.

నవీన్ పోలిశెట్టి హీరోగా లవ్ స్టోరీ!

By:  Tupaki Desk   |   23 March 2021 6:30 AM GMT
నవీన్ పోలిశెట్టి హీరోగా లవ్ స్టోరీ!
X
నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన 'జాతిరత్నాలు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ద్వారా అనుదీప్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి - దర్శకుడు అనుదీప్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.

అనుదీప్ మాట్లాడుతూ .. "మాది సంగారెడ్డి .. ఇంతకు ముందు నేను 'ఉయ్యాలా జంపాలా' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. తెలుగులో నేను అభిమానించే దర్శకులు కె.విశ్వనాథ్ గారు .. ఆయన సినిమాలను బాగా చూసేవాడిని. నేను చేసిన 'మిస్డ్ కాల్' షార్ట్ ఫిల్మ్ చూసి నాగ్ అశ్విన్ నాకు 'జాతిరత్నాలు' చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్ చేసి మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇంతగా ఎప్పుడూ నవ్వలేదని వాళ్లు చెబుతూ ఉంటే సంతోషంగా ఉంది.

ఈ సినిమా షూటింగు సమయంలో నవీన్ యాక్టింగ్ చూసి ఆయన అభిమానిని అయిపోయాను. నవీన్ ఒక సీన్ చేస్తున్నాడంటే, సెట్లో అంతా కూడా తమ పనులను ఆపేసుకుని ఆ సీన్ చూసేవారు. ఆయన యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. అందువల్లనే ఆయనతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాను. అందుకోసం లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాను. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లోనే ఉన్నాను. అంతా అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి నవీన్ త్వరలో ఓ లవ్ స్టోరీ చేయనున్నాడన్న మాట.