Begin typing your search above and press return to search.

కలిసి వచ్చిన కాలం.. కలెక్షన్స్ వర్షం

By:  Tupaki Desk   |   27 Sept 2021 1:07 PM IST
కలిసి వచ్చిన కాలం.. కలెక్షన్స్ వర్షం
X
ఇన్నాళ్లు వెయిట్‌ చేసినందుకు గాను లవ్‌ స్టోరీ సినిమాకు కాలం కలిసి వచ్చింది. ఇన్నాళ్లుగా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ లేకపోవడంతో పాటు.. చిన్న సినిమాలే విడుదల అయిన నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్ల వైపు చూడలేదు. ఎట్టకేలకు లవ్ స్టోరీ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో జనాలు క్యూ కట్టారు. లవ్ స్టోరీ సినిమాను మొదటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడాలని ఆశ పడుతూ వచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఫిదా మూవీ అన్ని వర్గాల వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్‌ అయ్యింది. అందుకే అలాంటి సినిమానే ఈ లవ్‌ స్టోరీ అనుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా.. ప్రస్తుతం చూడ్డానికి ఏదో ఒక సినిమా కావాలి కనుక.. పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో సాయి పల్లవి కోసం అయినా వెళ్లవచ్చు అని కొందరు చైతూ కోసం చూడవచ్చు అని కొందరు శేఖర్ కమ్ముల అభిమానులు అంటూ కొందరు థియేటర్ల బాట పట్టారు.

లవ్‌ స్టోరీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను నమోదు చేసి సెకండ్‌ వేవ్ తర్వాత బాక్సాఫీస్ కళకళ లాడటం చూపించింది. మొదటి రోజు టాక్ డివైడ్ గా వచ్చిన నేపథ్యంలో రెండవ రోజు వసూళ్ల పై ప్రభావం ఉంటుందేమో అనుకున్నారు. కాని శనివారం కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఇక ఆదివారం సహజంగానే అన్ని చోట్ల కూడా థియేటర్లు ఫుల్‌ రష్‌ తో కనిపించాయి. మెజార్టీ థియేటర్లు మూడు రోజులు కూడా హౌస్ ఫుల్‌ తో నడిచాయి. నైజాం ఏరియాలో పది కోట్ల వసూళ్లకు చేరువ అయ్యింది. ఇక ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉండటంతో పాటు కొన్ని చోట్ల థియేటర్లు మూత పబడి ఉన్నా కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు అనేది చాలా సింపుల్ గా లవ్‌ స్టోరీకి మారింది. లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో మూడు పదుల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చాలా కాలంగా థియేటర్లు మూత పడి ఉండటం.. ఓపెన్ అయినప్పటి నుండి చిన్న సినిమాలు విడుదల అవుతూ ఉండటం.. ప్రేక్షకులు పెద్ద సినిమా కోసం వెయిట్‌ చేస్తూ ఉండటం వంటి కారణాలతో కాలం కలిసి వచ్చి లవ్‌ స్టోరీకి ఊహించిన దాని కంటే ఎక్కువగా ఆశించిన దానికంటే అదనంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.

యూఎస్ లో కూడా ఈ సినిమా వకీల్‌ సాబ్‌ ను కేవలం రెండు రోజుల్లోనే క్రాస్ చేసింది. సినిమా మిలియన్‌ మార్క్‌ కు చేరువ అయ్యింది. లాంగ్ రన్ లో ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూళ్లను లవ్‌ స్టోరీ దక్కించుకుంటుందని అంటున్నారు. గత ఏడాదిన్నర కాలంగా యూఎస్ లో తెలుగు సినిమాలు పెద్దగా వచ్చింది లేదు. అక్కడి ప్రేక్షకులు తెలుగు సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో లవ్‌ స్టోరీ రావడంతో అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్‌ లవ్‌ స్టోరీ పై పడుతున్నారు. ఈమద్య కాలంలో అక్కడ హాలీవుడ్ సినిమాల్లో ఒకటి రెండు తప్ప ఈ రేంజ్ వసూళ్లను దక్కించుకున్న సినిమాలు రాలేదు అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి లవ్‌ స్టోరీకి కాలం కలిసి రావడంతో యావరేజ్ టాక్ మూవీకి సూపర్‌ హిట్‌ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. లవ్‌ స్టోరీకి వస్తున్న వసూళ్లు ఇతర సినిమాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వచ్చే దసరాకు విడుదల కాబోతున్న సినిమాల్లో దేనికి లక్‌ కలిసి వస్తుంది.. ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి.