Begin typing your search above and press return to search.

కల చెదిరింది.. కథ ముగిసింది.. కన్నీరే ఇక మిగిలింది..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 7:37 AM GMT
కల చెదిరింది.. కథ ముగిసింది.. కన్నీరే ఇక మిగిలింది..!
X
తెలుగు సినిమాకు ఒక శఖం ముగిసింది. తెలుగు తెర మీద ఒక తరం హీరో ప్రస్థానం ముగిసింది. తెలుగు సినిమాని తమ భుజస్కందాల మీద మోసి.. తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు రావడంలో ఎన్నో వ్యయ ప్రయాసలు చేసిన ఒక మనిషి గుండె ఆగిపోయింది. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ తర్వాత తెలుగు సినిమాలపై అంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిన హీరో నట శేఖరుడు కృష్ణ.

ఆయన చేసిన సినిమాలు.. ఆయన చేసిన ప్రయోగాలు.. ఆయన తీసుకొచ్చిన కొత్త సాంకేతిక విప్లవం.. ఇవన్ని ముందు తరాలకు ఒక దిక్సూచిగా పనిచేస్తాయి. సినిమా తీయడం అంటే ఎలా అయినా తీయొచ్చు కానీ ఆ సినిమా తర్వాత తరానికి మార్గదర్శకంగా నిలవాలంటే అందుకు రిస్క్ తీసుకోక తప్పదు.

అలాంటి రిస్క్ లని ఎన్నో చేసిన హీరో కృష్ణ. మాస్ ఇమేజ్ ఉన్న హీరో మన్నెం దొరగా మెప్పించారు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా తీశారు. అంతేకాదు తన వల్ల కాదు అంటూ కామెంట్స్ చేసే పౌరాణిక సినిమా చేశారు. నీ వల్ల కాదు అన్న ప్రతిసారి నా వల్లే అవుతుందని నిరూపించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ.

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తొలి సినిమాతోనే మెప్పించి మూడవ సినిమాతోనే ఒక పాపులారిటీ తెచ్చుకున్న కృష్ణ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరిని మెప్పిస్తూ వచ్చారు. ముఖ్యంగా తెలుగు తెర మీద స్పై, జేమ్స్ బాండ్ సినిమాలు తీసి ఆంధ్రా జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. సాహసమే ఆయన ఊపిరి అన్నది ఆయన గురించి తెలిసిన ఎవరైనా సరే చెప్పేమాట. అంతేకాదు మంచి మనసున్న హీరో కూడా ఆయనే.

సినిమా అంటే కేవలం డబ్బు కోసమే కాదు అని ఆయన చాలాసార్లు ప్రూవ్ చేశారు. లాభం వస్తే అందరికీ లాస్ వస్తే మాత్రం తన వంతు బాధ్యతగా ఎంతోకొంత భరించే వారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా మరీ అంత కఠినంగా ఉండే వారు కాదు. ఈ విషయాన్ని కృష్ణ గారితో పనిచేసిన అందరు నిర్మాతలు చెప్పారు.

తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దుతూ ఆయన చేసిన ప్రతి సినిమా ఓ నిఘంటువులో చేర్చుకునేలా చేశారు కృష్ణ. ఆ తరం ఓ తీయని జ్ఞాపకంగా ఇన్నాళ్లు మన ముందు ఉన్న ఆయన ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లారంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. కల చెదిరింది.. కథ మారింది.. కాదు కథ ముగిసింది.. కన్నీరే ఇక మిగిలింది అని ఘట్టమనేని అభిమానులంతా కూడా కన్నీటి పర్యంతంతో కృష్ణ గారికి నివాళి అర్పిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.