Begin typing your search above and press return to search.

ఆగస్టు 11.. మూడూ ‘భారీ’ సినిమాలే

By:  Tupaki Desk   |   8 Aug 2017 11:55 AM GMT
ఆగస్టు 11.. మూడూ ‘భారీ’ సినిమాలే
X
ఆగస్టు 11న ఒకే రోజు మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడూ ‘భారీ’ సినిమాలే కావడం విశేషం. భారీ.. అంటే బడ్జెట్ పరంగా అని కాదు. నిడివి పరంగా. ఈ మూడు సినిమాల్లో అతి పెద్ద సినిమా.. ‘లై’. ఆ చిత్ర నిడివి ఏకంగా 2 గంటల 40 నిమిషాలుండటం విశేషం. యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ లాగా కనిపిస్తున్న ‘లై’ ఈ ట్రెండుకు తగ్గట్లుగా రెండుంబావు గంటలకు అటు ఇటుగా ఉంటుందనుకుంటే.. ఏకంగా అంత నిడివి సెట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమాలో ద్వితీయార్ధం పెద్దగా ఉంటుందని అంటున్నారు.

ఇక నిడివి పరంగా రెండో పెద్ద సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నిడివి 2 గంటల 33 నిమిషాలు. రాజకీయ నేపథ్యంలో సినిమా అనగానే కొంచెం నిడివి ఎక్కువుంటుందనే అంచనా వేశారు. అందుకు తగ్గట్లే తయారైందీ సినిమా. ఇక మూడో సినిమా ‘జయ జానకి నాయక’ రన్ టైం 2 గంటల 29 నిమిషాలట. మిగతా రెంటితో పోలిస్తే ఇది కొంచెం చిన్న సినిమాలా అనిపించొచ్చు కానీ.. గత కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండు ప్రకారం చూస్తే ఈ లెంగ్త్ కూడా ఎక్కువే. నాలుగైదేళ్లుగా తెలుగు సినిమాల నిడివి రెండుంబావు గంటలకు అటు ఇటుగా ఉంటోంది. నిడివి ఎక్కువైతే జనాలకు లాగ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుండటంతో మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఎడిటింగ్ టైంలో కోతలు వేస్తున్నారు. కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రాబోతున్న సినిమాలు మాత్రం నిడివి విషయంలో అస్సలు రాజీ పడట్లేదు.