Begin typing your search above and press return to search.

బయ్యర్లకు ఇప్పుడైనా జ్నానోదయమవుతుందా?

By:  Tupaki Desk   |   4 April 2017 9:02 AM GMT
బయ్యర్లకు ఇప్పుడైనా జ్నానోదయమవుతుందా?
X
ఒక పెద్ద సినిమాకు భారీ నష్టాలు వస్తే.. నిర్మాతలు ఏదో రకంగా వారి నష్టాల్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. నష్టాల్లో కొంత మొత్తాన్ని భరిస్తూ.. రివర్స్ చెల్లింపులు చేయడమో లేదంటే తర్వాతి సినిమాను అదే బయ్యర్లకు కొంచెం తక్కువకు అమ్మడమో చేస్తారు. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దారుణమైన నష్టాలు మిగిల్చినపుడు.. బయ్యర్లను ఆదుకోవడానికే పవన్ అండ్ కో ‘కాటమరాయుడు’ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా మీద హైప్ కూడా పెద్దగా లేకపోవడంతో తక్కువ రేట్లకే సినిమాను అమ్మేలాగా కూడా కనిపించారు. కానీ టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. సినిమాకు హైప్ పెరిగిపోయింది. దాంతో పాటే నిర్మాత ఆలోచన మారిపోయింది.

పాత మాటలు పక్కకెళ్లాయి. కొత్తగా బిజినెస్ లెక్కలు తెరమీదికి వచ్చాయి. పవన్ సినిమా అనగానే అత్యుత్సాహం ప్రదర్శించే బయ్యర్లు కూడా వేలం వెర్రిగా సినిమాను కొనేశారు. ఒకరు ఐదు కోట్లంటే.. ఇంకొకరు ఏడు కోట్లని.. మరొకరు పది కోట్లని.. ఇలా పోటీతో ఇష్టానుసారం రేట్లు పెంచేయడంతో ఎప్పట్లాగే భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. గత అనుభావాల దృష్ట్యా కొంచెం టెంప్టేషన్ తగ్గించుకుని ఉంటే.. ‘కాటమరాయుడు’ రేట్లు కొంచెం హద్దుల్లోనే ఉండేవి. కానీ అత్యాశ.. అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు సినిమా చూస్తే కనీసం పాతిక కోట్లు నష్టం మిగిల్చేలా ఉంది. బయ్యర్ల పరిస్థితేంటి అంటే లాభాలొస్తే నిర్మాతకు వాటా ఇస్తారా.. మరి నష్టాలొచ్చినపుడు ఎందుకు అడుగుతారు అన్న లాజిక్ తెరమీదికి వస్తుందేమో.

కానీ అంతంత భారీ నష్టాలు వస్తున్నపుడు.. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి భారీగా ఆదాయం మిగుల్చుకున్న నిర్మాత-హీరో కొంతలో కొంతైనా నష్టాల్ని భర్తీ చేయడం.. మానవతా దృక్పథంతో నిండా మునిగిన బయ్యర్లను ఆదుకోవడం సమంజసం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ పవన్-శరత్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు. ‘సర్దార్’ బయ్యర్లను పవన్ పట్టించుకోకపోవడం చూస్తే ‘కాటమరాయుడు’ బయ్యర్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. చివరగా తేలిందేమంటే.. బయ్యర్లు వాళ్ల జాగ్రత్తలో వాళ్లుండాలి. తేడా వస్తే పవన్ ఉన్నాడులే అన్న భరోసా వదిలేయాలి. అయినకాడికి డబ్బులు పెట్టి వేలం వెర్రిగా సినిమాను కొనే అలవాటు మానుకుని కాస్త జాగ్రత్త పాటిస్తే మంచిది.