Begin typing your search above and press return to search.

అతడికి ఆస్కార్.. ప్రపంచం షేకైపోయింది

By:  Tupaki Desk   |   29 Feb 2016 5:30 PM GMT
అతడికి ఆస్కార్.. ప్రపంచం షేకైపోయింది
X
బహుశా ఆస్కార్ చరిత్రలోనే ఏ అవార్డుకూ ప్రపంచం ఇంతగా స్పందించి ఉండదేమో. హాలీవుడ్ సూపర్ స్టార్ లియనార్డో డికాప్రియోను ఆస్కార్ వరించిన నేపథ్యంలో అలాంటి రెస్పాన్స్ వస్తోంది మరి. హాలీవుడ్ చరిత్రలో అత్యంత గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న లియనార్డో ఆస్కార్ కోసం దాదాపు రెండు దశాబ్దాల నుంచి నిరీక్షిస్తున్నాడు. ఇక అతడి అభిమానుల ఆకాంక్షలకైతే హద్దే లేదు. కుర్రాడిగా ఉండగా ‘టైటానిక్’ సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చినపుడే అతడికి ఆస్కార్ వచ్చేస్తుందని అంచనా వేశారు. కానీ ఆశ నెరవేరలేదు. ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న డికాప్రియో.. ఆ తర్వాత మరిన్ని అద్భుతమైన సినిమాలు చేసి తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నాడు.

ఆస్కార్ అవార్డుల్లో ఎన్నోసార్లు ఉత్తమ నటుడి అవార్డుకు అతడి పేరు పరిశీలనకు వచ్చింది. నామినేషన్లు కూడా వచ్చాయి. కానీ అవార్డు మాత్రం గెలుచుకోలేకపోయాడు. కొన్నేళ్ల కిందట ‘ది ఇన్సెప్షన్’ సినిమాకు అవార్డు పక్కా అని అంతా అనుకున్నారు కానీ.. అప్పుడు కూడా నిరాశే మిగిలింది. ఐతే ఈ ఏడాది ‘ది రివెనంట్’ సినిమాకు అవార్డు ఇచ్చి తీరుతారని అంచనా వేశారు. ఆ సినిమాలో అంత అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు లియనార్డో. ఈసారి అవార్డు రాకపోయి ఉంటే ఎలా ఉండేదో కానీ.. ఆ ఆశ నెరవేరగానే ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లియొనార్డోకు సంబంధించిన విశేషాలే టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సెలబ్రెటీలు సైతం లియనార్డోకు అవార్డు రావడంపై ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఇక మామూలు అభిమానుల పరిస్థితైతే మామూలుగా లేదు. ఉత్తమ నటుడిగా లియనార్డో పేరు ప్రతిపాదించగానే సంబరాలు మోతెక్కిపోయాయి. దానికి సంబంధించిన వీడియోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.