Begin typing your search above and press return to search.

అమెజాన్‌ అడవుల కోసం హీరో 36 కోట్ల విరాళం

By:  Tupaki Desk   |   26 Aug 2019 9:16 PM IST
అమెజాన్‌ అడవుల కోసం హీరో 36 కోట్ల విరాళం
X
ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడవిగా పేరు గాంచిన అమెజాన్‌ అడవుల్లో కారు చిచ్చు మొదలైన విషయం తెల్సిందే. ఇప్పటికే కొన్ని వేల చెట్లు తగులబడి పోవడంతో పాటు వందాలాది వన్య ప్రాణులు మృతి చెందాయని స్థానికుల ద్వారా తెలుస్తోంది. జాతీయ మరియు అంతర్జాతీయ మీడియాలో అమెజాన్‌ అడువుల్లో కారు చిచ్చు గురించిన వార్తలు ప్రముఖంగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అయ్యో అంటున్నారు. ఈ భూమి మీద మనుషులు మరియు జంతువులు వినియోగిస్తున్న ఆక్సీజన్‌ లో 20 శాతంను అమెజాన్‌ అడువుల్లో ఉన్న చెట్లు అందిస్తున్న విషయం తెల్సిందే. అందుకే అమెజాన్‌ అడవులు తగులబడి పోతుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కు పోతుంది.

ఇటీవలే మహేష్‌ బాబుతో పాటు పలు ఇండియన్‌ స్టార్స్‌ ఈ విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. ఇక హాలీవుడ్‌ స్టార్స్‌ తమవంతు సాయంగా అమెజాన్‌ అడవుల పరిరక్షణకు ముందుకు వస్తున్నారు. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో అమెజాన్‌ అడవుల్లో చెలరేగిన కారు చిచ్చుపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. తన అభిమానులకు వారికి చేతనైన సాయం చేయాలంటూ ఇప్పటికే పిలుపునిచ్చాడు. తాజాగా భారీ విరాళంను ప్రకటించాడు.

ఇటీవలే లియోనార్డో డికాప్రియో ఎర్త్‌ అలయన్స్‌ అనే ఫౌండేషన్‌ ను స్థాపించాడు. దాని ద్వారా పర్యావరణం పరిరక్షించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫౌండేషన్‌ తరపునే అమెజాన్‌ అడవుల పునరుద్దరణ కోసం 5 మిలియన్‌ డాలర్లు(రూ.36 కోట్లు) విరాళంగా ఇచ్చాడు. ఈ మొత్తంలోని ప్రతి పైసాను కూడా అమెజాన్‌ అడవుల సంరక్షణ కోసం వినియోగిస్తానంటూ హామీ ఇచ్చాడు. వన్య ప్రాణులను కాపాడేందుకు ఈ మొత్తంను ఉపయోగించబోతున్నట్లుగా ఆయన టీం ప్రకటించింది. ఇతర హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.