Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ గాయ‌ని పి.సుశీల బ‌యోపిక్ .. ఏ.ఆర్ రెహ‌మాన్ నిర్మాత‌!!

By:  Tupaki Desk   |   27 May 2021 6:42 AM GMT
లెజెండ‌రీ గాయ‌ని పి.సుశీల బ‌యోపిక్ .. ఏ.ఆర్ రెహ‌మాన్ నిర్మాత‌!!
X
ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా మారి సంగీతం నేప‌థ్యంలో `99 సాంగ్స్` అనే క్లాసిక్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కినా కోవిడ్ వ‌ల్ల ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వెళ్ల‌ని ప‌రిస్థితి ఎదురైంది. 99 సాంగ్స్ చిత్రంతో ఏ.ఆర్.రెహ‌మాన్ స్క్రీన్ రైటర్ గా మారారు. లెజెండరీ సింగర్ సుశీలా ఇటీవల ఈ చిత్రాన్ని చూశారు. అనంత‌రం ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు.. తన బయోపిక్ చేయాలని లెజెండ‌రీ గాయ‌ని రెహమాన్ ను ప్రేమ‌పూర్వ‌కంగా అభ్యర్థించారు.

ఇటీవల నేను సుశీలమ్మతో ఫోన్ కాల్ లో మాట్లాడిన‌ప్పుడు నా 99 సాం్స్ సినిమా చూశారా? అని అడిగాను. నెట్ ఫ్లిక్స్ లో చూడమని చెప్పాను. అందుకు సుశీల‌మ్మ సోద‌రుడు సాయప‌డ్డారు. సినిమా చూసిన తరువాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్ ను 99 సాంగ్స్ మాదిరిగా మంచిగా చేయమని కూడా ఆమె నన్ను కోరారు.. అని రెహమాన్ తెలిపారు. తన బయోపిక్ తీయమని లెజెండ‌రీ సుశీలమ్మ‌ కోరగానే ఉద్వేగానికి లోన‌య్యాన‌ని ఆనందం క‌లిగింద‌ని రెహ‌మాన్ అన్నారు. 99 సాంగ్స్ కి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించగా న‌వ‌త‌రం నాయ‌కానాయిక‌ల్ని రెహ‌మాన్ తెర‌కు ప‌రిచ‌యం చేశారు. హిందీ- తమిళం- తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ - జియో సినిమాల్లో అందుబాటులో ఉన్నాయి.

పి.సుశీల (పులపాక సుశీల) లెజెండ‌రీ గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13 న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవారు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు.. పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల త‌న‌దైన‌ గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ- హిందీ- బెంగాలీ- ఒరియా- సంస్కృతం- తుళు- బడుగ- సింహళ భాషలలో 50 వేలకు పైగా పాట‌లు పాడారు. భాష ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ- కన్నడ భాషలలో మాట్లాడగలరు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడ‌తారు.

వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావును సుశీల పెళ్లాడారు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` (ఇద్ద‌రు) అనే తమిళ చిత్రంలో ఎ.ఆర్. రహమాన్ తో కలసి ఆరంగేట్రం చేసిన గాయని. రెహామాన్ కి సుశీల‌మ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సుశీల బ‌యోపిక్ తెర‌కెక్కిస్తార‌నే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.