Begin typing your search above and press return to search.

లక్ష్మీపార్వతి పాత్రకు ఆ హాట్ హీరోయిన్

By:  Tupaki Desk   |   12 Nov 2017 11:11 AM GMT
లక్ష్మీపార్వతి పాత్రకు ఆ హాట్ హీరోయిన్
X
చడీచప్పుడు లేకుండా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ షూటింగ్ ను ఈ రోజే (ఆదివారం) మొదలుపెట్టేశాడు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర షూటింగ్ చేయబోగా.. పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది. ఐతే సినిమా అయితే మొదలుపెట్టేశాడు కానీ.. ఇందులో ప్రధాన పాత్రలు ఎవరు చేస్తారన్నది కేతిరెడ్డి వెల్లడించలేదు.

మరి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారు.. లక్ష్మీ పార్వతి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా స్పష్టత లేదు. లక్ష్మీపార్వతి పాత్రకు వాణీ విశ్వనాథ్ ను సంప్రదిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆమె కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తిగానే కనిపించింది. కానీ వాణీ విశ్వనాథ్ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన నేపథ్యంలో కేతిరెడ్డి వెనక్కి తగ్గాడట. పైగా ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న నేపథ్యంలో ఈ పాత్ర చేస్తే వేరే సంకేతాలు వెళ్తాయి జనాల్లోకి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రలో రాయ్ లక్ష్మీ నటించే అవకాశాలు ఉన్నాయట. ఆమె ఈ పాత్ర చేయడానికి సుముఖంగానే ఉందట. తెలుగులో వరుసగా ఐటెం సాంగ్సే చేస్తున్న తనకు పూర్తి స్థాయి పాత్ర చేసే అవకాశం రావడంతో ఆమె ఓకే అన్నట్లు తెలుస్తోంది. రాయ్ లక్ష్మీని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం అడిగిన మాట వాస్తవమే అని.. చర్చలు జరుగుతున్నాయని కేతి రెడ్డి కూడా కన్ఫమ్ చేశాడు. మరి లక్ష్మీ పార్వతి పాత్రకు రాయ్ లక్ష్మీ ఏమాత్రం సూటవుతుందో.. ఇంతకీ ఎన్టీఆర్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.