Begin typing your search above and press return to search.

పవన్ అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్

By:  Tupaki Desk   |   8 April 2016 5:12 AM GMT
పవన్ అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్
X
సర్దార్ గబ్బర్ సింగ్ సందడి షురూ అయ్యింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ అభిమాన కథానాయకుడి సినిమా రిలీజ్ తో పవన్ అభిమానులకు ఉగాది కొన్ని గంటల ముందే వచ్చేసిందని చెప్పాలి. శుక్రవారం విడుదలకు ముందే.. గురువారం అర్థరాత్రి నుంచే సర్దార్ సందడి మొదలైంది. హైదరాబాద్ తో సహా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి బెనిఫిట్ షోలు వేయటం మొదలు పెట్టారు. దీంతో. టిక్కెట్ల కోసం విపరీతమైన రద్దీ ఏర్పడింది.

హైదరాబాద్.. విజయవాడ.. విశాఖ.. నెల్లూరు.. తిరుపతి.. కడప ఇలా చెప్పుకుంటూ పోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. పవన్ అభిమానులతో కిక్కిరిసిన థియేటర్ పరిసరాలు.. టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. నెల్లూరులో సర్దార్ టిక్కెట్ల కోసం ఒక థియేటర్ వద్ద పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దీంతో.. అభిమానుల్ని కంట్రోల్ చేయటం కోసం పోలీసులు లాఠీల్ని ఝుళిపించారు. ఈ ఉదంతంలో పవన్ అభిమానిఒకరికి గాయాలు అయ్యాయి. అంబులెన్స్ తెప్పించిన పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల లాఠీ ఛార్జ్ తో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకొని వారిని మాటలతో కంట్రోల్ చేయాలే కానీ.. పోలీసులు ఇలా లాఠీలు విదల్చటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.