Begin typing your search above and press return to search.

చిక్కబల్లాపూర్ లో RRR ఈవెంట్..?

By:  Tupaki Desk   |   16 March 2022 10:32 AM GMT
చిక్కబల్లాపూర్ లో RRR ఈవెంట్..?
X
ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ భారీ ప్రమోషన్లతో సందడి చేస్తున్నారు.

'R' త్రయం రామ్ చరణ్ - రామారావు - రాజమౌళి కలిసి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. మరోవైపు దుబాయ్ మరియు కర్ణాటకలలో నిర్మాతలు రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్ లో గ్రాండ్ గా జరగబోయే కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతిథిలుగా హాజరు కానున్నారు.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అలానే స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా స్పెషల్ గెస్టుగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకను దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఏదైతేనేం తెలుగు రాష్ట్రాల్లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏమీ లేవనే వార్త ఎన్టీఆర్ మరియు మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అలానే ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రాంతాల్లో కాకుండా రాజమౌళి ఈ వేడుక కోసం చిక్కబళ్లాపూర్ ని ఎందుకు ఎంచుకున్నారో అని అందరూ ఆలోచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహిస్తే జనాలను మేనేజ్ చేయడం చాలా కష్టం కాబట్టి అగ్ర దర్శకుడు చిక్కబళ్లాపూర్ ని ఎంచుకున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. చిక్కబళ్లాపూర్ ప్రాంతం ఆంధ్ర మరియు కర్ణాటక సరిహద్దులో ఉంది. అక్కడ ఎక్కువ శాతం తెలుగు వాళ్లే నివాసం ఉన్నారు.

అంతేకాదు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకు ఈ ప్రాంతంలో భారీ ఫాలోయింగ్ ఉంది. వారి గత చిత్రాలు అక్కడ మంచి వసూళ్లు రాబట్టాయి. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ఇది సరైన లొకేషన్ అని జక్కన్న భావించారట.

అలాగే కర్ణాటకలో మన హీరోల మార్కెట్ పెద్దది. అక్కడ ఈ ఈవెంట్ చేయడం వల్ల ఒకేసారి తెలుగు మరియు కన్నడ రెండింటినీ కవర్ చేయవచ్చు. ఈ కార్యక్రమానికి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో జరిగే రెండు పెద్ద ఈవెంట్స్ తో RRR సినిమాపై బజ్ రెట్టింపు అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవ వీరులు కలిస్తే ఎలా ఉంటుందనేది ఊహించి రాసిన కథతో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తారక్ సరసన ఒలివియా మోరీస్.. చరణ్ కి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. అజయ్ దేవగన్ - సముద్ర ఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.

డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై డి. దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో పెన్ స్టూడియోస్.. తమిళ్ లో లైకా సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు. కె కె సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేసిన ఈ సినిమాకి బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాశారు.