Begin typing your search above and press return to search.

పునీత్ రాజ్ కుమార్ `ట్రేడ్ మార్క్` అదిరెను

By:  Tupaki Desk   |   2 March 2022 4:01 AM GMT
పునీత్ రాజ్ కుమార్ `ట్రేడ్ మార్క్` అదిరెను
X
క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆక‌స్మిక మ‌ర‌ణాన్ని అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌తిభ‌కు చిరునామా.. మంచిత‌నానికి కేరాఫ్ అడ్రెస్ అత‌డు. అందుకే పునీత్ మ‌ర‌ణం తీవ్ర క‌ల‌త‌కు కార‌ణ‌మైంది. పునీత్ రాజ్‌కుమార్ డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి సింబాలిక్ గా మాష‌ప్ వీడియోలు కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అత‌డు న‌టించిన‌ చివరి చిత్రం జేమ్స్ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తానికి కర్నాటకలో మార్చి 17న ఇతర సినిమాలేవీ ప్రదర్శించబడనందున ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దివంగత కన్నడ పవర్ స్టార్ కి ఇది గొప్ప నివాళి. ఇందులో అత‌డిని మంచిత‌న‌పు రాయ‌బారి అంటూ ప్ర‌స్థావించిన తీరు బావుంది. అత‌డి ప్ర‌తిభ‌ను స్పైడ‌ర్ మేన్.. సూప‌ర్ మేన్.. బ్యాట్ మ్యాన్ అంటూ పొగిడేశారంటే అందులో ఎంతో వాస్త‌విక‌త‌ క‌నిపిస్తోంది. పునీత్ న‌ట‌న డ్యాన్సులు లైవ్ వైర్ లా ఎంతో ఎన‌ర్జిటిక్ అని వీడియో చెబుతోంది.

ఇప్ప‌టికే పునీత్ అభిమానుల్లో జేమ్స్ మూవీపై బోలెడంత ఆస‌క్తి నెల‌కొంది. త‌మ ఫేవ‌రెట్ హీరో చివరి చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. నిర్మాతలు తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

ఇప్పుడు జేమ్స్ నుండి ఒక ర్యాప్ పాట ..పునీత్ `ట్రేడ్ మార్క్` తో సిద్ధ‌మై వ‌చ్చింది. అది తెలుగులోకి అనువాద‌మైంది. ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఇది పునీత్ అభిమానులకు పండగను తెచ్చిందంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పునీత్ కి జోడీగా ప్రియా ఆనంద్‌ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించ‌గా.. చరణ్ రాజ్ సంగీతం అందించారు. పునీత్ రాజ్ కుమార్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ.. హీరో శ్రీకాంత్- విజయ్ ఎమ్ సంయుక్తంగా తెలుగు వెర్షన్ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

తెలుగు వెర్షన్ మార్చి 17న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. సినిమా ఎలా ఉన్నా కానీ పునీత్ అభిమానులందరికీ ఇది ఒక ఎమోషనల్ మూవ్ మెంట్. థియేట‌ర్ల‌లో ఎగ్జ‌యిట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.