Begin typing your search above and press return to search.

పర్సులు కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ టీవీ నటి

By:  Tupaki Desk   |   14 March 2022 4:30 AM GMT
పర్సులు కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ టీవీ నటి
X
ఆమె ఒక ప్రముఖ టీవీ నటి. చూసినంతనే గుర్తు పట్టే ఇమేజ్ ఉన్న ఆమె.. పర్సులు కొట్టేసే చిల్లర పనుల్ని చేస్తుందన్న విషయం తాజాగా నిరూపితం కావటం.. పోలీసులు సైతం ఆమెను అరెస్టు చేయటం షాకింగ్ గా మారింది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న నటి.. ఇలాంటి పని చేయటమా? అని నోరెళ్లబెడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె బ్యాగ్ ను తనిఖీ చేసిన పోలీసులకు దొరికిన డైరీ ఈ మొత్తం ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టుగా చెబుతున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరంటే..

బెంగాల్ టీవీ నటిగా సుపరిచితురాలు రూపాదత్తా పర్సుల్ని దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. బెంగాలీ టీవీ సీరియల్స్ లో సుపరిచితమైన ఆమె.. కోల్ కత్తాలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో పర్సులు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. ఆ మధ్యన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేయటం.. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆరోపించటం తెలిసిందే.

అలాంటి ఆరోపణలు చేసిన ఆమె.. తాజాగా పోలీసులకు పర్సులు దొంగలిస్తూ దొరికిపోవటం షాకింగ్ గా మారింది. ఇక.. ఆమె పట్టుబడిన విధానం కూడా కాస్త డిఫరెంట్ గా ఉందని చెప్పాలి. ఖాళీ పర్సుల్నిఅక్కడున్న చెత్త బుట్టలో పడేస్తున్న ఆమె తీరుపై సందేహం వచ్చిన పోలీసులు.. ఆమె బ్యాగ్ ను తనిఖీ చేశారు.

ఆమె బ్యాగులో మరిన్ని పర్సులతో పాటు రూ.70వేల నగదు.. డైరీ ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఆమె ఎప్పుడు ఎన్ని చోరీలు చేసిన వివరాలన్ని రాసుకున్నట్లుగా గుర్తించారు. తాను పర్సులు దొంగతనం చేస్తానన్న విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

తాను చాలాసార్లు దొంగతనం చేశానని.. వాటికి సంబంధించిన వివరాల్ని డైరీలో రాసుకున్నట్లుగా పోలీసులకు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో పిక్ పాకెట్స్ చేసేదానిని.. డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నట్లుగా ఆమె చెప్పారని పోలీసులు చెబుతున్నారు. పేరున్న నటిగా ఉండి కూడా ఇలా పర్సులు కొట్టేయటమా? అని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.