Begin typing your search above and press return to search.

నాగ్ తన 100వ సినిమాను అలా ప్లాన్ చేశాడా?!

By:  Tupaki Desk   |   2 March 2022 3:15 AM GMT
నాగ్ తన 100వ సినిమాను అలా ప్లాన్ చేశాడా?!
X
ఒక వైపున చిరంజీవి .. మరో వైపున బాలకృష్ణ తెలుగు తెరను ఏలేస్తుండగా నాగార్జున రంగంలోకి దిగారు. ఇక తన తోటివాడైన వెంకటేశ్ నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కుంటూ ముందుకు వెళ్లారు. హీరోకి సంబంధించిన కాస్ట్యూమ్స్ లో నాగార్జున కొత్త ట్రెండ్ ను సృష్టించాడు.

అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ఇతర భాషల్లోను కీ రోల్స్ చేస్తూ వెళ్లారు.మల్టీ స్టారర్లు చేయడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. ఇక నిర్మాతగా కూడా ఆయన చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు కథ కొత్తదనం వైపు పరుగులు తీయడంలో ఆయన పాత్ర కూడా ఉందనేది కాదనలేని వాస్తవం.
 
నాగార్జున తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటిని కూడా ఆయన తట్టుకుని నిలబడ్డారు. ఎంతోమంది కొత్త దర్శకులు .. కొత్త హీరోయిన్లు నాగార్జున సినిమాల ద్వారా పరిచయమయ్యారు.

 అలాంటి నాగార్జున ఇటీవల నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు' సినిమాను చేశారు. భారీ వసూళ్లను సాధిస్తూ ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. తాను వెనకుండి ఈ సినిమా సక్సెస్ ను చైతూ ఖాతాలో వేయడానికి ఆయన పడిన తాపత్రయం కనిపిస్తుంది.

ఇక ఇప్పుడు ఆయన అఖిల్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గత్తంలో ఈ ఇద్దరూ 'మనం' సినిమా కోసం తెరపై కలిసి కనిపించారు. కానీ ఇప్పుడు 'బంగార్రాజు'లో చైతూ మాదిరిగానే, నాగ్ సినిమాలో అఖిల్ కనిపించనున్నాడని అంటున్నారు. నాగ్ తన 100వ సినిమాను ఇలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ రూమర్ ఒక రేంజ్ లో వినిపిస్తోంది. అయితే సోలో హీరోగా నాగ్ తెలుగులో చేసిన సినిమాలు ఒక 80 వరకూ కనిపిస్తున్నాయి. ఇతర భాషల్లో ముఖ్యమైన రోల్స్ చేసినవి కూడా కలుపుకుంటే 100వ సినిమాకి దగ్గరలో ఉన్నట్టే.

'బంగార్రాజు' స్టేజ్ పై కూడా నాగార్జున తన 100వ సినిమాను ఎలా లెక్కగట్టాలనేది ఆలోచన చేస్తానని అన్నారు.  మరి ఆయన ఏ సినిమాను 100వ సినిమాగా తేలుస్తారనేది చూడాలి. సంఖ్య సంగతి అలా ఉంచితే ఈ సినిమా నాగ్ సొంత బ్యానర్లో .. మోహన్ రాజా దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుందనేది కాస్త నమ్మదగినదిగానే కనిపిస్తోంది. కథ కుదిరితే .. సరైన కథ దొరికితే అఖిల్ ను హైలైట్ చేస్తూ .. తాను వెన్నంటి ఉండే పాత్రను చేయడం నాగ్ కి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అది తన 100 సినిమా అయితే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అదెప్పుడు అనేది నాగ్ నే చెప్పాలి.