Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ .. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:31 AM GMT
పుష్ప రాజ్ .. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప-1` ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న ఈ చిత్రంలో క‌థానాయిక‌. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్. బ‌న్ని వ‌ర్సెస్ ఫ‌హ‌ద్ కాంబినేష‌న్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఠ‌ఫ్ ఫైట్ తెర‌పై ర‌క్తి క‌ట్టిస్తుందని తొలి నుంచి టాక్ ఉంది. ఫ‌హ‌ద్ ఫాజిల్ కి మ‌ల‌యాళంలో క్రేజీ బజ్ ఉంది. అత‌డికి ధీటుగా మ‌ల్లూ అర్జున్ పాపులారిటీకి కొద‌వేమీ లేదు. తాజా స‌మాచారం మేర‌కు.. బన్నీ -ఫహద్ మధ్య ముఖాముఖి హోరాహోరీ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరో- విల‌న్ మ‌ధ్య సన్నివేశాలు సినిమాకు అతి పెద్ద హైలైట్ కానున్నాయి. పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ డిసెంబర్ లో విడుదలవుతుంది.


`పుష్ప-డ్యూయాలజీ` పై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. బన్నీని నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించే ఫ్రాంఛైజీగా నిలిచిపోతుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. స్టైలిష్ టిఫికల్ ఫిలిం మేకర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడం- హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రెండు భాగాల ఫ్రాంచైజీలో మొదటి భాషం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్ట్ -1 ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపించనుందని యూనిట్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ రెండు పాత్రల ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో వివాహిత గా గృహిణిగా రష్మిక కనిపించనుందని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అంటే పుష్పరాజ్- రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారని టాక్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టే తాజా లుక్ ని రివీల్ చేశారు సుకుమార్.

ర‌ష్మిక‌తో బ‌న్ని ఇంటిమేట్ సన్నివేశాలు మాస్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా సుకుమార్ స్టైల్లో ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఇద్దరి పాత్రల స్వరూపం ఎలా ఉంటుందన్నది లుక్స్ రూపంలో బయటపడింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతే హైలైట్ గా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తిగా చిత్తూరు మాండలికంలో నే రెండు పాత్రలు మాట్లాడుతాయి. ఆ శైలికి ఎంత మాత్రం తగ్గకుండా మాస్ కోణంలో ఆద్యంతం పాత్రలు రక్తికట్టిస్తాయని తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన నారప్ప చిత్రంలో నెల్లూరు-చిత్తూరు యాస ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంది. పుష్పలో ఈ యాస పాళ్లు మరింత అదనపు ఆకర్షణ కానున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా నాయకానాయికలే చిత్తూరు యాసతో అదరగొట్టడం ఫ్యాన్స్ కి ఓ రేంజులోనే కనెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక గ్లామ‌ర‌స్ యాంగిల్ మ‌రో ప్ర‌ధాన ఆకర్ష‌ణ కానుంది. అసలు తగ్గేదేలే అంటూ పుష్ప క్రిస్మ‌స్ బ‌రిలో వ‌స్తోంది. డిసెంబర్ లో పుష్ప 1 రిలీజ్ ఖాయ‌మైంది. సంక్రాంతి 2022 బరిలో తీవ్రమైన పోటీ కారణంగా పుష్పను సోలో రిలీజ్ చేస్తున్నారు.