Begin typing your search above and press return to search.

మెగా మీటింగ్ కు 240 మందిని పిలిస్తే.. వచ్చింది అంత మందేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 2:44 AM GMT
మెగా మీటింగ్ కు 240 మందిని పిలిస్తే.. వచ్చింది అంత మందేనా?
X
తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు ఆహ్వానించినా.. వెళ్లటానికి పెద్ద పెద్ద ప్రముఖులు పోటీలు పడతారు. ఇక.. ఒక మోస్తరు వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ఎన్ని పనులున్నా..వాటిని పక్కన పెట్టేసి మరీ వెళ్లే వారెందరో. అలాంటిది సీనియర్ నిర్మాత జి. అదిశేషగిరి రావు అధ్యక్షతన ఎఫ్ఎసీసీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.

దీనికి ఇండస్ట్రీకి చెందిన 24 క్రాఫ్టులకు చెందిన 240 మందిని ఆహ్వానించారు. అయితే.. ఈ మీటింగ్ కు హాజరైన వారెందరో తెలుసా? అక్షరాల 60నుంచి 70 మంది మాత్రమే. అంటే.. మొత్తం ఆహ్వానం పంపిన వారిలో కేవలం.. 25 శాతం మంది మాత్రమే హాజరు కావటం చూస్తే.. సమస్యల పరిష్కారం మీద అసలు ఆసక్తి ఉందా? లేదా? అన్న సందేహం కలుగక మానదు.

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించటానికి వెళ్లిన వారిలో కేవలం ఎస్ఎస్ రాజమౌళి.. నిరంజన్ రెడ్డి మినహా మరే ముఖ్యుడు హాజరు కాకపోవటం గమనార్హం. అంతేనా.. తనకు తాను ప్రత్యేకంగా వెళ్లి మరీ ఏపీ సీఎం జగన్ ను కలిసిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ చర్చా కార్యక్రమానికి హాజరు కాకపోవటం గమనార్హం.

అయితే.. సమావేశానికి హాజరైన వారు తక్కువ మందే అయినా.. చక్కటి వాతావరణంలో మీటింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. అన్నిక్రాఫ్టులకు సంబంధించిన వారు మాట్లాడటమే కాదు.. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చ జరిగిందని చెబుతున్నారు.

తదుపరి మీటింగ్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామంటున్నారు. మీటింగ్ ఎంత బాగా జరిగినప్పటికి.. ఎక్కువ మంది డుమ్మా కొట్టటం చూస్తే.. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం మీద వారికి ఉన్న కమిట్ మెంట్ ఎంతన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.