Begin typing your search above and press return to search.

రిలీజ్ కు రెడీ అవుతోన్న '18 పేజెస్'.. రామారావుతో పోటీ తప్పదా..?

By:  Tupaki Desk   |   23 March 2022 8:31 AM GMT
రిలీజ్ కు రెడీ అవుతోన్న 18 పేజెస్.. రామారావుతో పోటీ తప్పదా..?
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అందులో "18 పేజెస్" మూవీ ఒకటి. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ '18 పేజెస్' చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇందులో నిఖిల్ సరసన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే '18 పేజెస్' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. సుకుమార్ ఒక వైవిధ్యమైన ప్రేమ కథాంశంలో నిఖిల్ - అనుపమలను భాగం చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌ లో ఉందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ తో ఈ లవ్‌ స్టోరీని పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి

నిజానికి "18 పేజెస్" చిత్రాన్ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాలని చూసారు. కానీ కరోనా పాండమిక్ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 2022 జూన్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అయితే అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదల కానుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. మరి అదే టైంలో నిఖిల్ చిత్రాన్ని కూడా విడుదల చేస్తారో లేదో చూడాలి.

"18 పేజెస్" చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.