Begin typing your search above and press return to search.

వెండితెరను మైదానంగా మార్చేస్తున్న సినిమాలివే!

By:  Tupaki Desk   |   19 Feb 2022 2:30 PM GMT
వెండితెరను మైదానంగా మార్చేస్తున్న సినిమాలివే!
X
సినిమా ప్రధానమైన ప్రయోజనం ఆనందాన్ని కలిగించడమే కాదు, స్ఫూర్తిని రేకెత్తించడం కూడా. జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించినవారి చరిత్రలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని రేకెత్తిస్తూ ఉంటాయి .. చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. క్రీడా నేపథ్యం కలిగిన సినిమాల్లో వినోదం పాళ్లు తగ్గకుండా చూసుకుంటూనే, సందేశాన్ని ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా క్రీడా స్ఫూర్తి కలిగిన సినిమాల జాబితాలో 'భాగ్ మిల్కా భాగ్' .. 'దంగల్' .. 'మేరీకోమ్' దర్శనమిస్తాయి.

క్రితం ఏడాది 'సైనా' .. 'రష్మీ రాకెట్' .. '83' ప్రేక్షకులను అలరిస్తే, ఈ ఏడాదిలోను ఆ తరహా సినిమాలు కొన్ని లైన్లో ఉన్నాయి. అమితాబ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'జుండ్' ఫుట్ బాల్ నేపథ్యంలో నడుస్తుంది. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన పదిమంది వీధి బాలలను చేరదీసి వాళ్లను ఫుట్ బాల్ ఆటగాళ్లుగా తయారుచేసిన విజయ్ బర్సే జీవిత కథ ఇది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఇదే ఫుట్ బాల్ గేమ్ నేపథ్యంలోనే 'మైదాన్' సాగుతుంది.

అజయ్ దేవగణ్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోంది. అమిత రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, జూన్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' రూపొందుతోంది. జాన్వీ కపూర్ - రాజ్ కుమార్ రావ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతుండగా శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఇదే క్రికెట్ నేపథ్యంలో 'చెక్ దా ఎక్స్ ప్రెస్' .. 'జెర్సీ' సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. భారతీయ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క శర్మ ప్రధానమైన పాత్రను పోషించింది.

కొంత కాలం గ్యాప్ తరువాత ఆమె చేసిన సినిమా ఇది. ప్రొసిట్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' ద్వారా అభిమానుల ముందుకు రానుంది. ఇక తెలుగులో నానితో 'జెర్సీ' చేసి హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి అదే కథను .. అదే టైటిల్ తో హిందీలో షాహిద్ కపూర్ తో చేశాడు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది.

ఇక బాక్సింగ్ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి ఆ గేమ్ చుట్టూ ఉండే ఎమోషన్స్ వేరు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్ అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. ఇక స్నూకర్ ఆట నేపథ్యంలో కూడా ఒక సినిమా వస్తుండటం ఆశ్చర్యమే. మృదుల్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'తులసీదాస్ జూనియర్' అనే టైటిల్ ను సెట్ చేశారు.

సంజయ్ దత్ ప్రధానమైన పాత్రను పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో వరుణ్ బుద్ధదేవ్ - రాజీవ్ కపూర్ కనిపించనున్నారు. ఇలా ఈ ఏడాది కూడా వెండితెరపై ఆటలపోటీలు ఒక రేంజ్ లో జరగనున్నాయన్న మాట.