Begin typing your search above and press return to search.

రెండో పెళ్లికి రెడీ అవుతున్న 'జీన్స్' హీరో!

By:  Tupaki Desk   |   22 March 2022 5:00 PM IST
రెండో పెళ్లికి రెడీ అవుతున్న జీన్స్ హీరో!
X
హీరో ప్రశాంత్ అనగానే .. ప్రశాంత్ ఎవరబ్బా? అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రాళ్లకు ఆయన అంతగా తెలియదు. 'జీన్స్' ప్రశాంత్ అంటే మాత్రం చాలామంది వెంటనే ఆయనను గుర్తుకు చేసుకుంటారు. శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన 'జీన్స్' సినిమాను ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేరు. ఐశ్వర్య రాయ్ తో కలిసి ప్రపంచంలోని అన్ని వింతలలో పాట పాడేసుకున్న ఆ అదృష్టవంతుడిని చూసి అప్పట్లో అసూయపడనివారు లేరు.

ప్రశాంత్ మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ ఉన్నవాడు. నూనూగు మీసకట్టుతోనే సినిమాల్లోకి వచ్చాడు. బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హీరో. పాత సినిమాలు చూసేవారికి పేకేటి శివరామ్ అంటే తెలుస్తుంది. ఆయన నటుడు .. దర్శక నిర్మాత కూడా. ఆయనకి మనవాడే ప్రశాంత్. ఇక ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ కూడా నటుడు .. దర్శక నిర్మాత. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించాడు. తెలుగులో కృష్ణంరాజు హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'అంతిమ తీర్పు'లో విలన్ ఆయనే.

ప్రశాంత్ తమిళ అనువాదాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడనుకుంటే పొరపాటే. తెలుగులో ఆయన 'ప్రేమశిఖరం' .. 'లాఠీ' .. 'తొలిముద్దు' వంటి సినిమాలు చేశాడు. ఆ తరువాత వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ కి అన్నయ్యగా కనిపించాడు. ప్రశాంత్ కి గల క్రేజ్ గురించి తెలిసినవాళ్లు ఆయన ఆ పాత్రను అనవసరంగా ఒప్పుకున్నాడని అనుకున్నారు. అలాంటి ప్రశాంత్ వైవాహిక జీవితం సక్రమంగా సాగలేదు. ఓ వ్యాపార వేత్త కూతురితో ఆయన వివాహం 2005లో జరిగింది.

2008లో అపార్థాల కారణంగా వారిద్దరూ విడిపోయారు .. అప్పటికి వారికి ఒక బాబు ఉన్నాడు. భార్య నుంచి విడాకులు తీసుకున్న ప్రశాంత్ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ వచ్చాడు. త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి బాగా తెలిసిన ఫ్యామిలీలోని అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన 'అంధాదున్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఈ పెళ్లి జరగనుందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.