Begin typing your search above and press return to search.

మూడు ఇండస్ట్రీలను చుట్టబెట్టేస్తున్న ముద్దుగుమ్మ!

By:  Tupaki Desk   |   10 March 2022 4:17 AM GMT
మూడు ఇండస్ట్రీలను చుట్టబెట్టేస్తున్న ముద్దుగుమ్మ!
X
రష్మిక .. స్టార్ హీరోలతోనే 'క్రష్'మిక అనిపించుకున్న హీరోయిన్. రష్మికను ఆఫ్ స్క్రీన్ చూసిన ఎవరికైనా ఆమె ఎలా వరుస అవకాశాలను దక్కించుకుంటుందనే విషయం అర్థమైపోతుంది. ఆమె అంత యాక్టివ్ ఉంటుంది .. ప్రతి సినిమా టీమ్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతుంది. ఇక తాను ఏ సినిమా చేసినా చివరి నిమిషం వరకూ ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. సినిమాలోనే కాదు హీరోయిన్ లేని ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చప్పగానే సాగుతుందని కొన్ని ఈవెంట్లు నిరూపించాయి.

అలాంటి ఒక వెలితి లేకుండా రష్మిక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సైతం రష్మిక సందడి చేస్తుంది. రీసెంట్ గా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకి సంబంధించి ప్రతి ప్రెస్ మీట్ కి .. సక్సెస్ మీట్ కి కూడా ఆమె వచ్చింది. అంతలా ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేస్తున్నందు వలన ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు .. ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక ఆమె అందానికీ .. అభినయానికి అదృష్టం కూడా తోడు కావడంతో అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి.

ఆల్రెడీ కన్నడలో ఆమె స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తోంది. ఇక తెలుగులోను నెంబర్ వన్ స్థానానికి చేరువలో ఉంది. ఇక ఆ తరువాత ఆమె హిందీ .. తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. హిందీలో కుదురుకోవడానికి ఆమె తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఆమె ఫస్టు మూవీ 'మిషన్ మజ్ను' జూన్ 10వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత లైన్లోనే మరో సినిమా ఉంది. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ కి బాగానే కనెక్ట్ అవుతాననే ఒక నమ్మకంతో ఉంది. ఆ తరువాత తమిళంలోను తన జోరు చూపించాలనే ఆలోచన ఆమెకు ఉంది.

రష్మిక ఆల్రెడీ ఆ మధ్య కార్తి జోడీగా తమిళంలో 'సుల్తాన్' చేసింది. కారణమేదైనా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు ఆమె విజయ్ జోడీగా ఒక సినిమా చేయనుందనే టాక్ వినిపిస్తోంది. తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి .. మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాంటి విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగుతో పాటే తమిళంలోను ఈ సినిమా విడుదలవుతుంది.

భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ ను తెలుగుకు తీసుకువచ్చి ఒక భారీ సినిమాను చేయడం .. తెలుగు దర్శకుడితో తమిళ స్టార్ హీరోతో సినిమా చేయించడం దిల్ రాజుకే చెల్లింది. ఈ సినిమాలోనే కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. చాలా ఇంటర్వ్యూలలో విజయ్ అంటే తనకి చాలా ఇష్టమనీ .. ఆయన స్టైల్ తనకి బాగా నచ్చుతుందని రష్మిక చెప్పింది.

ఆయన సినిమాను గురించి ఆమెను సంప్రదించడం నిజమే అయితే ఆమె మాత్రం వదులుకునే ఛాన్సే లేదు. ఈ సినిమా ఒప్పుకుంటే ఎక్కే ఫ్లైటూ .. దిగే ఫ్లైటూ అన్నట్టుగా ఉంటుందన్న మాట రష్మిక పరిస్థితి. టాలీవుడ్ టు కోలీవుడ్ .. కోలీవుడ్ టు బాలీవుడ్ ఫ్లైట్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటుందన్న మాట. ఆర్టిస్ట్ కి టైమ్ వస్తే టైమ్ ఉండదనే కోట మాట ఇక్కడ గుర్తుకు రావడం లేదూ!