Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: అంతేగా అంతేగా.. టాలీవుడ్ లోనూ అంతేగా..!

By:  Tupaki Desk   |   2 March 2022 3:30 PM GMT
డ్రగ్స్ కేసు: అంతేగా అంతేగా.. టాలీవుడ్ లోనూ అంతేగా..!
X
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాబడి, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆర్యన్ ను అంతర్జాతీయ డ్రగ్స్ కుట్రతో సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అలాగే, ఆర్యన్ ఖాన్ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ లో భాగమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారని తెలుస్తోంది. గోవాకు వెళ్లే కోర్డెలియా క్రూయిజ్ షిప్ పై జరిపిన దాడిలో కొన్ని అక్రమాలు జరిగాయని మాత్రమే అధికారులు చెప్తున్నారట. ఈ అంశాన్ని సిట్ ఇంకా పరిశీలిస్తోంది.

ముంబై జోన్ హెడ్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం కార్డెలియా క్రూయిజ్ షిప్ పై అక్టోబరు 2 అర్థరాత్రి దాడి చేసింది. ఆర్యన్ ఖాన్ మరియు మరికొందరిని మాదక ద్రవ్యాల కుట్ర మరియు డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉండటం - వాటి అమ్మకం కొనుగోలుకు సంబంధించి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (NDPS) సెక్షన్ల కింద కేసు నమోదయింది.

ముంబై ఆర్ధర్ రోడ్ జైలులో కొన్నాళ్ళు గడిపిన ఆర్యన్.. బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా ట్రయిల్ కోర్టు రెండుసార్లు పిటిషన్ ను తిరస్కరించింది. తరువాత ఖాన్ తన న్యాయవాది ద్వారా బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్ 28న బెయిల్ మంజూరు అయింది. న్యాయపరమైన ప్రక్రియల కారణంగా, అక్టోబర్ 30న ఆర్యన్ జైలు నుండి విడుదలయ్యాడు.

డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నైజీరియన్లు సహా 20 మందిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కుట్రతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అంటున్నారు. 2017లో టాలీవుడ్ లో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కేసులో కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

నాలుగున్నరేళ్లుగా విచారణ జరుగుతున్నా తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థలు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురాలేదు. ఇంతవరకు ఎలాంటి సరైన ఆధారాలు లభించకపోవడం వల్లనే.. ఒక్క సెలబ్రిటీ కూడా అరెస్ట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పట్లో సినీ ప్రముఖుల నుంచి సేకరించిన గోళ్లు - తల వెంట్రుకలు మరియు రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకపోవడంతో అందరికీ ఎక్సైజ్ శాఖ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈడీ మాత్రం మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది. ఆర్థిక లావాదేవీలు - డ్రగ్స్ వినియోగం - క్రయ విక్రయాలలో సినీ ప్రముఖుల పాత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే పలువురుని ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు మరియు సాక్షుల వాంగ్మూలాలు - ఫోన్ కాల్ డేటా కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను కోరారు. ఈడీ రాసిన లేఖకు సమాధానం రాకపోవడంతో.. ఎక్సైజ్ శాఖ కేసు వివరాలు ఇవ్వడం లేదంటూ హైకోర్ట్‌ కు వెళ్లారు. దీంతో ఈ కేసుకి సంబంధించి రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి త్వరలోనే డాకుమెంట్స్ అన్నీ ఈడీ చేతికి చేరి ఈ కేసుని పరిష్కరిస్తారేమో చూడాలి.