Begin typing your search above and press return to search.

పదేళ్ల 'ఇష్క్'.. నటుడిగా పునర్జన్మ అన్న నితిన్..!

By:  Tupaki Desk   |   24 Feb 2022 11:30 AM GMT
పదేళ్ల ఇష్క్.. నటుడిగా పునర్జన్మ అన్న నితిన్..!
X
యూత్ స్టార్ నితిన్ - నిత్యా మీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ''ఇష్క్''. నితిన్ కెరీర్ లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. అప్పటి వరకు వరుస అపజయాలతో డీలా పడిన యువ హీరోకి ఈ మూవీ నూతనోత్సాహాన్ని ఇచ్చింది. అప్పటి నుంచే తన ట్రాక్ మార్చుకొని బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. అందుకే నితిన్ కెరీర్ ను 'ఇష్క్'కు ముందు.. ఇష్క్ తరువాత అని విభజించవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం నేటితో దశాబ్దం పూర్తి చేసుకుంది.

''ఇష్క్'' చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి మరియు విక్రమ్ గౌడ్ ఈ సినిమాని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (2012 ఫిబ్రవరి 24) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. 'ఇష్క్' విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ ''ఇష్క్ అప్పుడే పదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. ఈ చిత్రం ప్రధానంగా మూడు విషయాల కోసం గుర్తుంచుకోవాలి.. ఇందులో నితిన్ - నిత్యా మీనన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. పిసి శ్రీరామ్ సర్ విజువల్స్ కారణంగా సినిమా చాలా యంగ్ గా ఫ్రెష్ గా అనిపించింది. ఇక మూడవది అనూప్ రూబెన్స్ సంగీతం. 'ఇష్క్' నా కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్. తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను. నాపై నమ్మకం ఉంచిన నితిన్‌ - సుధాకర్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు'' అని అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. ''ఫిబ్రవరి 24 నా కెరీర్‌ లో చాలా ప్రత్యేకమైన తేదీ. పదేళ్ల క్రితం ఇదే తేదీన 'ఇష్క్' సినిమా విడుదలైంది. ఇది చాలా మరపురాని చిత్రం. ఇది దాదాపు నటుడిగా నాకు పునర్జన్మ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్‌ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నాలుగు కారణాల వల్ల ఇష్క్ పెద్ద హిట్ అయింది. విక్రమ్ కుమార్ కథ - దర్శకత్వం ప్రధాన కారణం. రెండవది పిసి శ్రీరామ్ యొక్క మ్యాజికల్ ఫ్రేమ్‌ లు - అద్భుతమైన విజువల్స్. అలానే అనూప్ మరియు అరవింద్-శంకర్ అద్భుతమైన సంగీతం మూడో కారణం. నిత్యామీనన్‌ తో నా కెమిస్ట్రీ నాల్గవ కారణం. ఈ డ్రీమ్ టీమ్‌ తో మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

హీరోయిన్ నిత్యా మీనన్ మాట్లాడుతూ ''ఇష్క్ నా రెండో తెలుగు సినిమా.. మా అందరికీ ఇది చాలా ప్రత్యేకమైనది. ఇప్పటికీ చాలా మంది నన్ను 'ప్రియా ప్రియా' పాట పాడమని అడుగుతుంటారు. నేను పాట పాడటం.. నా పాటకు నా ఫస్ట్ పేమెంట్ అనూప్ నుండి తీసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. పీసీ సార్ తో ఇది నా మొదటి చిత్రం.. నితిన్‌ - విక్రమ్‌ కుమార్ లతో ఇది నా ఫస్ట్ మూవీ. నితిన్ మరియు నా జోడీని చాలా మంది మెచ్చుకున్నారు. మనందరం చూడదగ్గ క్యూట్ సినిమాని విక్రమ్ తీశాడు. ప్రస్తుతం అందరం విభిన్న స్థానాల్లో ఉన్నాము కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. కానీ మేము దీనిని కలిసి జరుపుకోగలమని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పని చేయడం చాలా బాగుందన్నారు. ''ఇష్క్ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన చిత్రం. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు సంగీత ప్రియులందరికీ నా ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. కాగా, 'ఇష్క్' చిత్రంలో నితిన్ - నిత్యమీనన్ లతో పాటుగా అజయ్ - సింధు తులాని - రోహిణి - నాగినీడు - సుధ - అలీ - శ్రీనివాస రెడ్డి - సుప్రీత్ - రవి ప్రకాశ్ - తాగుబోతు రమేశ్ - రత్న శేఖర్ రెడ్డి - సత్య క్రిష్ణన్ తదితరులు నటించారు.