Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించేలా బాలయ్య ప్లాన్స్..!

By:  Tupaki Desk   |   24 Feb 2022 2:30 AM GMT
పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించేలా బాలయ్య ప్లాన్స్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని మేకర్స్ అధికారికంగా విడుదల చేసారు.

మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న బాలయ్య.. 'అఖండ' చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ ను సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఇప్పుడు #NBK107 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ వీక్షించేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇతర భాషల్లో పాపులర్ నటీనటులను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. అలానే కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఇదే క్రమంలో కన్నడ ఫేమస్ యాక్టర్ దునియా విజయ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలను బట్టి.. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన ఫిలిం మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ ప్లాన్ చేస్తూ.. అనేక పరిశ్రమలకు చెందిన నటీనటులను నటింపజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కే చిత్రంలో కోలీవుడ్ - శాండిల్ వుడ్ - మాలీవుడ్ ఇండస్ట్రీల స్టార్స్ ను తీసుకున్నారని అర్థం అవుతోంది.

'అఖండ' సినిమాలో సైతం పలువురు ఇతర భాషల నటీనటులు కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ అశేష ప్రేక్షకాదరణ అందుకుంది. బాలీవుడ్ జనాలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అలానే తమిళ్ లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన విషయం విధితమే. బాలయ్య సినిమా నేషనల్ వైడ్ అందరినీ ఆకర్షించిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని #NBK107 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

కాగా, వాస్తవ సంఘటనల ఆధారంగా పక్కా మాస్‌ అండ్ హై ఇంటెన్స్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా #NBK107 చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇటీవల విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మైనింగ్ ప్రాంతంలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని.. పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి బాలయ్య స్టైలిష్‌ గా కనిపించారు. ఈ ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమాలో నటసింహ ఎంత పవర్‌ ఫుల్ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేసారు. మరో పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఆతృతగా వేచి చూస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్‌ ఎర్నేని - వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత NBK107 మొదటి షెడ్యూల్ షూటింగ్ సిరిసిల్లలో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ అనంతరం కర్నూల్ జిల్లాలోని అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయంలో రెండురోజుల చిత్రీకరణ జరపనున్నారు. మార్చి 3 - 4వ తేదీలలో షూటింగ్ జరుపుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మేకర్స్ అనుమతి తీసుకున్నారు.