Begin typing your search above and press return to search.

అంతకష్టం వచ్చింది కనుకనే ఆత్మహత్య చేసుకోవాలనుకుందట!

By:  Tupaki Desk   |   25 July 2022 8:58 AM GMT
అంతకష్టం వచ్చింది కనుకనే ఆత్మహత్య చేసుకోవాలనుకుందట!
X
సముద్రమన్న తరువాత కెరటాలు .. జీవితమన్న తరువాత కష్టాలు ఉంటూనే ఉంటాయి. జీవితంలో ఒడిదుడుకులు మామూలే. ఒకచోట ఓడిపోయామని బాధపడుతూ ఉండగానే .. మరోచోట గెలుపు ఎదురవుతూ ఉంటుంది. నిరాశతో నిట్టూర్చుతూ ఉండగానే ఆశ గమ్యం వైపు నడిపిస్తూ ఉంటుంది.

ఒక్కోసారి ఇక గెలవలేము అనిపించినప్పుడు జీవితాన్ని చాలించాలనే తొందరపాటు నిర్ణయాలకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి బలమైన ఎదురుదెబ్బలు తనకి తగిలాయనీ .. ఆత్మహత్య చేసుకోవాలనే బలహీనమైన క్షణాలు తనకి ఎదురయ్యాయని తాజా ఇంటర్వ్యూలో సింగర్ కల్పన చెప్పుకొచ్చారు.

సింగర్ కల్పన అనే పేరు వినగానే గలగలమని సాగే ఆమె స్వర ప్రవాహం బుల్లితెర ప్రేక్షకులకు వెంటనే గుర్తొస్తుంది. 'స్వరాభిషేకం' కార్యక్రమం ద్వారా కల్పన అందరికీ తెలిశారని చెప్పచ్చు. అంతకుముందు ఆమె సినిమాల్లో పాడినప్పటికీ, ఆ కార్యక్రమం ఆమెను జనంలోకి తీసుకెళ్లింది. కల్పన ఏ భాషకి సంబంధించిన పాటనైనా అద్భుతంగా ఆలపిస్తారు. దాంతో ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే విషయం ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది. అంతగా ఆమె ఏ పాట పాడినా అది మాతృభాషలో పాడినట్టుగానే ఉంటుంది.

తమిళనాడుకి చెందిన కల్పన .. గాయకుల కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి టీఎస్ రాఘవేంద్ర సినీ నేపథ్య గాయకుడే .. తల్లి కూడా మంచి గాయని. అందువల్లనే వారు కల్పనకి చిన్నప్పటి నుంచి సంగీతాన్ని నేర్పించారు. బాలనటిగా ఒక వైపున సినిమాల్లో నటిస్తూనే మరో వైపున ఆమె సంగీతాన్ని నేర్చుకున్నారు. 'మణిశర్మ స్వరకల్పనలో 'మనోహరం' సినిమా కోసం ఆమె పాడిన ఒక పాట మంచి పేరును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఆమె తెలుగు సినిమాలలో .. టీవీ షోలతో పాప్యులర్ అవుతూ వచ్చారు.

తాజా ఇంటర్వ్యూలో కల్పన మాట్లాడుతూ .. "ఎన్నో ఆశలతో అల్లుకున్న వివాహబంధానికి .. పాప పుట్టిన తరువాత తెరపడిపోయింది. జీవితంలో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఏం చేయాలన్నది తోచలేదు .. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ 'చిత్ర'గారు నాకు ధైర్యం చెప్పారు.

ఓటమి పాఠం లాంటిది ... గెలుపు పాటలాంటిది .. ముందుకు వెళ్లమని ప్రోత్సహించారు. అలా నాకు అప్పుడు మలయాళం సరిగ్గా రాకపోయినా ఒక పాటల పోటీలో పాల్గొని 'విల్లా' గెలుచుకున్నాను. ఆ గెలుపు నాకు ఎంతో ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. చీకటితో పోరాడితేనే వెలుగులోకి వస్తామని అర్థమైంది. అప్పటి నుంచి నా ప్రయాణం ఆగకుండా సాగుతూనే ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.